Donald Trump: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్ ఇంధన ఇంకా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడానికి అమెరికా విధించిన గడువు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సోమవారం వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇరాన్‌ను ఒక్క రాత్రిలోనే నాశనం చేయగల శక్తి అమెరికాకు ఉందని, ఆ రాత్రి “రేపే”(మంగళవారం) కావచ్చు అని బాంబు పేల్చారు.
శాంతి ప్రతిపాదన తిరస్కరణ.. ఉద్రిక్తతలకు కారణం
అమెరికా ప్రతిపాదించిన తాత్కాలిక కాల్పుల విరమణను ఇరాన్ తిరస్కరించిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
-
ఇరాన్ డిమాండ్లు: ఇరాన్ తన ప్రతిస్పందనను పాకిస్థాన్ ద్వారా పంపిస్తూ.. కేవలం తాత్కాలిక విరమణ కాకుండా, లెబనాన్, గాజాల్లో యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాలని డిమాండ్ చేసింది.
-
10-సూత్రాల ప్రణాళిక: ఇందులో భాగంగా హోర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను గుర్తించాలని, ఆంక్షలు ఎత్తివేయాలని, తన అణు హక్కులను ఆమోదించాలని ఇంకా ఆర్థిక నష్టపరిహారం చెల్లించాలని ఇరాన్ కోరింది.
దీనిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “టెహ్రాన్ పూర్తిగా బలహీనపడింది కాబట్టే కాల్పుల విరమణ కోరుకుంటోంది. వారికి నేను ఇచ్చిన అవకాశాలను వారు నీరుకార్చుకున్నారు అని ఎద్దేవా చేశారు.
“4 గంటల్లో ఇరాన్ అంధకారం” – ట్రంప్ వార్నింగ్
అమెరికా డిమాండ్లకు లొంగకపోతే కేవలం నాలుగు గంటల వ్యవధిలో ఇరాన్‌లోని ప్రతి వంతెనను, ప్రతి విద్యుత్ ప్లాంట్‌ను ధ్వంసం చేసే ప్రణాళిక తమ వద్ద సిద్ధంగా ఉందని ట్రంప్ హెచ్చరించారు.
వారికి ఇక వంతెనలు ఉండవు, విద్యుత్ ఉండదు.. ఏమీ మిగలదు. ఆ దేశం కోలుకోవడానికి దశాబ్దాలు పడుతుంది. మాకు అది ఇష్టం లేదు, కానీ వారు మమ్మల్ని ఆ స్థాయికి నెడుతున్నారు అని ట్రంప్ పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధిపై పట్టు
హోర్ముజ్ జలసంధిలో అమెరికా సుంకాలు విధించే అవకాశం ఉందని, సైనికంగా తామే విజేతలమని ట్రంప్ స్పష్టం చేశారు. జలసంధిలో స్వేచ్ఛాయుత రాకపోకలు తమకు ప్రధాన ప్రాధాన్యత అని ఆయన వెల్లడించారు. 2015 అణు ఒప్పందాన్ని విమర్శిస్తూ, అందులో అమెరికా కొనసాగి ఉంటే ఇజ్రాయెల్ ఇప్పటికే నాశనమై ఉండేదని వ్యాఖ్యానించారు.
యుద్ధ నేరం కాదా? ట్రంప్ సమర్థన
పౌర మౌలిక సదుపాయాలపై దాడి చేయడం యుద్ధ నేరం కాదా? అని ప్రశ్నించగా.. ఇరాన్ తన స్వదేశంలో వేలాది మందిని చంపుతోందని, వారు “జంతువుల” లాగా ప్రవర్తిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం లేకుండా చూడటమే తమ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
రంగంలోకి ఇజ్రాయెల్.. ముదురుతున్న పోరు
ఇదిలా ఉండగా, ఇరాన్ అనుబంధ సంస్థలు కువైట్, బహ్రెయిన్‌లోని చమురు మరియు విద్యుత్ కేంద్రాలపై దాడులు చేశాయి. దీనికి ప్రతిచర్యగా, ఇరాన్‌లోని ‘సౌత్ పార్స్ గ్యాస్ కాంప్లెక్స్’పై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది. అలాగే దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులను ఉధృతం చేసింది.
ట్రంప్ ఇచ్చిన గడువుకు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఈస్టర్ తర్వాత చర్యలను వాయిదా వేసినట్లు చెప్పిన ట్రంప్, “రేపటి వరకు వారికి సమయం ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం” అని ముగించారు.
