Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం రైల్వే స్టేషన్ త్వరలో సరికొత్త రూపు సంతరించుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద ఈ స్టేషన్‌ను ఆధునీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీని కోసం రూ. 37.25 కోట్ల భారీ నిధులను కేంద్రం కేటాయించింది. గతంలో పిఠాపురం వెళ్ళిన సమయంలో అక్కడి స్టేషన్ దుస్థితిని గమనించిన పవన్ కళ్యాణ్, ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి, పిఠాపురం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను వివరించి స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ నిధులతో పిఠాపురం రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం అత్యాధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు. స్టేషన్ భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రధాన ముఖద్వారాన్ని ఆకర్షణీయంగా నిర్మిస్తారు. ముఖ్యంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, అధునాతన విశ్రాంతి గదులు, పరిశుభ్రమైన టాయిలెట్లు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ప్లాట్‌ఫారాల విస్తరణతో పాటు ఎండ, వాన నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించేందుకు అదనపు షెల్టర్లను కూడా నిర్మించబోతున్నారు.
పిఠాపురం అభివృద్ధికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురం ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం కావడంతో, దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఈ మార్పులు ఎంతో సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ఈ అభివృద్ధి పనుల ద్వారా పిఠాపురం రైల్వే స్టేషన్ ఒక ప్రముఖ పర్యాటక మరియు ఆధ్యాత్మిక హబ్‌గా మారుతుందని ఆశిస్తున్నారు.
