Hyderabad: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. కేవలం 17 ఏళ్ల వయసున్న ఒక బాలుడు తన ఇంట్లోనే భారీ దొంగతనానికి పాల్పడి, ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. సుమారు 25 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారంతో ఆ బాలుడు అదృశ్యం కావడంతో స్థానికంగా ఈ వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఆ బాలుడు వెళ్తూ వెళ్తూ తన తండ్రికి ఒక లేఖ కూడా రాసి పెట్టడం విశేషం.
వివరాల్లోకి వెళితే, కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు సిద్ధార్థ్ రెడ్డి అనే 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. గత గురువారం రోజున సిద్ధార్థ్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, బీరువాలో ఉన్న సుమారు 9 తులాల బంగారం, 8 లక్షల రూపాయల నగదును తీసుకున్నాడు. అంతేకాకుండా, తన తండ్రికి చెందిన బైక్‌ను కూడా తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
బాలుడు వెళ్లే ముందు తన తండ్రి కోసం ఒక నోట్ రాసి పెట్టాడు. అందులో “సారీ నాన్నా.. నేను వెళ్ళిపోతున్నాను. బైక్‌ను బయట ఎక్కడో ఒకచోట వదిలేస్తాను” అని పేర్కొన్నాడు. సిద్ధార్థ్ కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు అతనికి ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో వెంటనే వారు స్థానిక కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు పారిపోవడమే కాకుండా, ఇంట్లో ఉన్న విలువైన సంపదను కూడా పట్టుకెళ్లాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, సిద్ధార్థ్ ఇలా పారిపోవడం ఇదే మొదటిసారి కాదని అతని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇలాగే ఇంటి నుండి వెళ్ళిపోయి, మళ్ళీ కొద్దిరోజులకు తిరిగి వచ్చాడట. కానీ, ఈసారి ఇంత భారీ మొత్తంలో డబ్బు, బంగారం తీసుకెళ్లడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుతో పాటు దొంగతనం కేసు కూడా నమోదు చేసి, బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
