Raghav Chadha: ఆమ్ఆద్మీ పార్టీ (AAP)లో కీలక నేతగా ఉన్న రాఘవ్ చడ్డా వ్యవహారం ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తనను తొలగించడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనను ఎంతగానో బాధించిందని చెబుతూ, ఒక ఎమోషనల్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన నోరు నొక్కినంత మాత్రాన తాను ఓడిపోయినట్లు కాదని, ప్రజల పక్షాన తన పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
పార్లమెంట్లో తాను ఎప్పుడూ సామాన్యుల సమస్యల గురించే మాట్లాడానని రాఘవ్ చడ్డా గుర్తు చేశారు. విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల అధిక ధరలు, టోల్ ప్లాజాల వద్ద జరుగుతున్న దోపిడీ, టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్ల వల్ల సామాన్యులు పడుతున్న ఇబ్బందులనే తాను సభ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఇలాంటి ప్రజా సమస్యలను ఎత్తిచూపడం తప్పా అని ఆయన పార్టీని ప్రశ్నించారు. తనను మాట్లాడకుండా అడ్డుకోవడం వల్ల పార్టీకి ఏం లాభం కలుగుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్లో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని స్వయంగా తన పార్టీయే రాజ్యసభ సెక్రటరీకి లేఖ రాయడంపై చడ్డా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన గళాన్ని అణచివేయాలని చూస్తున్నారని, కానీ తాను ఒక నది లాంటి వాడినని, సమయం వచ్చినప్పుడు తన ప్రతాపం చూపిస్తానని హెచ్చరించారు. ప్రజలు తన వెంటే ఉన్నారని, వారికోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, రాఘవ్ చడ్డా స్థానంలో అశోక్ మిత్తల్‌ను పార్టీ ఉపనేతగా ఆప్ నియమించింది. పార్టీ కార్యక్రమాలకు చడ్డా దూరంగా ఉంటున్నారనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఆయన త్వరలోనే బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో ఆప్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో వేచి చూడాలి.
