Nara Lokesh: రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడంపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ముమ్మాటికీ తమ భూములను త్యాగం చేసి, 1600 రోజులకు పైగా పోరాడిన అమరావతి రైతులదేనని ఆయన కొనియాడారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, గడచిన ఐదేళ్లలో రాజధాని కోసం రైతులు, మహిళలు పడ్డ కష్టాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతిని ఎంపిక చేశామని, దీనికి 2014లో వైసీపీతో సహా అన్ని పార్టీలు అంగీకరించాయని ఆయన వివరించారు.
గత వైకాపా ప్రభుత్వం అనుసరించిన ‘మూడు రాజధానుల’ విధానంపై లోకేష్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు అమరావతికి మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే మూడు రాజధానుల డ్రామా మొదలుపెట్టారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానుల విధానం సక్సెస్ కాలేదని ఆయన గుర్తు చేశారు. రాజధాని కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను, మహిళలను ప్రభుత్వం దారుణంగా హింసించిందని, కానీ రైతులు మొక్కవోని ధైర్యంతో పోరాడి విజయం సాధించారని లోకేష్ అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలుగు ప్రజలంతా కలిసి కట్టుకుని నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయామని, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్లిష్ట సమయంలో కేవలం 58 రోజుల్లోనే రైతులు 35 వేల ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని చెప్పారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు అమరావతికే తమ మద్దతు ప్రకటించారని, అందుకే కూటమి ప్రభుత్వానికి 94 శాతం స్ట్రైక్ రేట్‌తో భారీ విజయాన్ని కట్టబెట్టారని ఆయన గుర్తు చేశారు.
ప్రజల తీర్పు ఎంత స్పష్టంగా ఉందంటే.. జగన్ ‘కార్యనిర్వాహక రాజధాని’ అని చెప్పిన విశాఖపట్నంలోనే కూటమి ఎంపీ అభ్యర్థి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారని లోకేష్ పేర్కొన్నారు. దీనిని బట్టి ఏపీ ప్రజలందరూ అమరావతినే ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారని స్పష్టమైందన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు సహకరించిన ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మరియు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఒక్క పార్టీ మినహా దేశంలోని అన్ని పక్షాలు అమరావతికి అండగా నిలబడటం సంతోషకరమని లోకేష్ అన్నారు.
