Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక బిల్లు ఆమోదం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల కల సాకారమైన రోజని ఆయన అభివర్ణించారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా పార్లమెంటులో చరిత్రాత్మక నిర్ణయం జరిగిందని లోకేశ్ పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఏపీ అసెంబ్లీలో ‘ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని’ అనే నినాదంతో తీర్మానం చేశామని, ఇప్పుడు దానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలపడం శుభపరిణామమని లోకేశ్ అన్నారు. అమరావతిని రాజధానిగా నిలబెట్టేందుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాజకీయ పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలకు, ఏళ్ల తరబడి వారు చేసిన శాంతియుత పోరాటానికి దేవుడి ఆశీస్సులు లభించాయని ఆయన గుర్తు చేశారు.
మరోవైపు, అమరావతి బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో వైకాపా సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లడంపై లోకేశ్ మండిపడ్డారు. ఇది ఏపీ ప్రజలకు ఆ పార్టీ చేస్తున్న ద్రోహమని ఆయన విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతిలో ఒక ఇటుకను కూడా కదల్చలేరని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. అమరావతి అజరామరంగా వెలుగొందుతుందని లోకేశ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
