Purandeswari: లోక్సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బిజెపి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొని అమరావతి ప్రాముఖ్యతను ఇంకా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీకి కొత్త రాజధాని కచ్చితంగా అవసరమని, రాజధాని లేని రాష్ట్రంగానే ఏపీ తన ప్రస్థానాన్ని ప్రారంభించిందని ఆమె గుర్తు చేశారు.రాష్ట్ర విభజన సమయంలో సరైన చర్చ జరగకపోయినప్పటికీ, ఏపీ ప్రజలు ఆ విభజనను అంగీకరించి ముందుకు సాగారని తెలిపారు.
అమరావతిని నిర్మించేందుకు దాదాపు 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూములను ఇచ్చారని, తద్వారా అమరావతి దేశంలోనే తొలి ‘ప్రజా రాజధాని’గా గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు.అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా శంకుస్థాపన చేశారని ఆమె ప్రస్తావించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని విషయంలో తీవ్ర అస్థిరత నెలకొందని, ఆ ప్రభుత్వం తీసుకున్న అవివేకమైన నిర్ణయాల వల్ల రాజధాని అభివృద్ధి కుంటుపడిందని పురంధేశ్వరి తీవ్రంగా విమర్శించారు.
