School Holidays: తెలంగాణలో ఎండలు ముదురుతున్న వేళ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవుల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే పరీక్షల హడావుడిలో ఉన్న విద్యార్థులు, ఈ సెలవుల ప్రకటనతో ఎంతో ఖుషీ అవుతున్నారు. ఈ ఏడాది ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం ముందుగానే ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 24వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ వేసవి విరామం జూన్ 11 వరకు కొనసాగుతుంది. అంటే ఈసారి విద్యార్థులకు మొత్తం 48 రోజుల పాటు భారీగా సెలవులు లభించనున్నాయి. వేసవి సెలవులు ముగిసిన తర్వాత, తిరిగి జూన్ 12వ తేదీన 2026-27 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
సెలవుల కంటే ముందే సిలబస్‌ను పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు తరగతులు నిర్వహించి విద్యా ప్రణాళికను సజావుగా ముగించాలని పాఠశాల యాజమాన్యాలకు అధికారులు సూచించారు. మరోవైపు, ఎండలు తీవ్రం కాకముందే సెలవుల తేదీలను ప్రకటించడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సెలవుల ప్రకటన రావడంతో పిల్లలు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు, సమ్మర్ వెకేషన్ ప్లాన్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
