PBKS vs GT: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘనమైన బోణీ కొట్టింది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువ ఆటగాడు కూపర్ కనోలీ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించి, పంజాబ్ అభిమానులకు ఈ సీజన్ తొలి విజయాన్ని కానుకగా ఇచ్చాడు.
లక్ష్య ఛేదనలో తడబడిన పంజాబ్.. ఆదుకున్న కనోలీ
163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆరంభం ఆశాజనకంగానే లభించింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ 24 బంతుల్లో 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే, అతను అవుటైన తర్వాత పంజాబ్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (18) కొద్దిసేపు ప్రతిఘటించినా, మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరడంతో పంజాబ్ 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన కూపర్ కనోలీ అద్భుత పోరాట పటిమను కనబరిచాడు. గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఆఖరి ఓవర్లలో జేవియర్ బార్ట్లెట్ (5 బంతుల్లో 11 నాటౌట్) ఒక కీలక సిక్సర్ బాదడంతో పంజాబ్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరింది.
కట్టడి చేసిన బౌలర్లు.. పోరాడిన గిల్, బట్లర్
అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) రాణించడంతో ఆ జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశ్యాఖ్ 3 వికెట్లతో సత్తా చాటగా, సీనియర్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 2 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశారు.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3 వికెట్లు తీసి పంజాబ్‌ను ఇబ్బంది పెట్టినా, కనోలీ అసాధారణ ఇన్నింగ్స్ ముందు అది సరిపోలేదు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో తన ఖాతాను తెరిచింది.
