Chandrababu: తెలుగుదేశం పార్టీ (TDP) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన ఈ పార్టీ, నాలుగు దశాబ్దాలుగా సామాన్యులను చట్టసభలకు పంపడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచిగా నిలిచిందని ఆయన కొనియాడారు.
పేదవాడి ఆకలి తీర్చడమే ఎన్టీఆర్ ఆశయం
పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు (NTR) ఆశయాలను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. “పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని, ప్రతి ఒక్కరూ గౌరవంగా బతకాలన్నదే ఎన్టీఆర్ లక్ష్యం. ఆ ఆశయంతోనే టీడీపీ ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది” అని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా, బీసీ, ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో మార్పులు తీసుకురావడంలో టీడీపీ అగ్రగామిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. తాము ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలు నేడు దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచాయని గర్వంగా చెప్పారు.
ఇక మూడు ముక్కలాట లేదు.. అమరావతే రాజధాని
రాష్ట్ర రాజధాని విషయంపై చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. గత ఐదేళ్ల గందరగోళానికి తెరదించుతూ, “ఇకపై మూడు ముక్కలాట ఉండదు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని. హైదరాబాద్‌ను మించిన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం” అని ప్రకటించారు. అమరావతి వ్యతిరేక శక్తులను ఇక్కడకు రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణం కేవలం ఒక నగరం కట్టడం కాదని, అది రాష్ట్ర భవిష్యత్తుకు పునాది అని ఆయన స్పష్టం చేశారు.
కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివి
పార్టీ ఎదుర్కొన్న సంక్షోభాలు, సవాళ్ల గురించి మాట్లాడుతూ చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. “మనం కేవలం విజయాలే కాదు, ఎన్నో కష్టాలను కూడా చూశాం. ఎందరో కార్యకర్తలు తమ ఆస్తులను పోగొట్టుకున్నారు, ప్రాణ త్యాగాలు చేశారు. వారి త్యాగాల వల్లే నేడు పార్టీ ఈ స్థాయిలో ఉంది. టీడీపీని ఎవరూ ఏమీ చేయలేకపోయారు, భవిష్యత్తులో చేయలేరు” అని ధీమా వ్యక్తం చేశారు.
