Nara Lokesh

Nara Lokesh: కార్యకర్తలే పార్టీకి ప్రాణం.. మంగళగిరి సభలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు!

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ (TDP) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న అరాచకాలు, పార్టీ పటిష్టత కోసం వారు చేసిన త్యాగాలను లోకేష్ ఈ సందర్భంగా కొనియాడారు.

మెడపై కత్తి పెట్టినా జెండా వదలలేదు

వైసీపీ హయాంలో తెలుగుదేశం కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. “గత ప్రభుత్వంలో మనవాళ్ల మెడపై కత్తి పెట్టి బెదిరించినా, అక్రమ కేసులు పెట్టినా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. పార్టీ జెండాను వదలకుండా పోరాడారు” అని ఆయన ప్రశంసించారు. టీడీపీకి అడ్రస్ లేకుండా చేస్తామన్న వారే ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు నివాసంపై, పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తుచేశారు.

కార్యకర్తల సంక్షేమమే మా ప్రాధాన్యత

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి, గౌరవిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.

కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు రూ. 150 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. పార్టీ కోసం ప్రాణాలర్పించిన కార్యకర్తల పిల్లలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, వారి చదువుల బాధ్యత పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. చిన్న చిన్న కారణాలతో అలక పూనిన నేతలు, కార్యకర్తలు వెంటనే దాన్ని వీడాలని కోరారు. “మీరు అలిగితే పార్టీ మాత్రమే కాదు.. రాష్ట్రం, ప్రజలు కూడా నష్టపోతారు” అని పిలుపునిచ్చారు.

జగన్‌కు ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’ జబ్బు

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌కు ఈ మధ్య ‘క్రెడిట్ చోరీ డిజార్డర్’ అనే జబ్బు వచ్చిందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి తీసుకువస్తున్న కంపెనీలను తానే తెచ్చానని జగన్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఎన్టీఆర్ సంక్షేమ పాలనకు పునాది వేస్తే, చంద్రబాబు నాయుడు తనదైన విజన్‌తో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని కొనియాడారు. అబ్దుల్ కలాం, బాలయోగి వంటి మహనీయుల నియామకాల్లో టీడీపీ పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *