Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రాజధాని అమరావతిపై జరిగిన చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని, దానివల్ల కొత్త రాష్ట్రం ఏర్పడే నాటికి కనీసం సరైన కార్యాలయాలు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆయన గుర్తు చేశారు. అటువంటి క్లిష్ట సమయంలో చంద్రబాబు నాయుడు ఒక బలమైన ఆశావాదిగా నిలబడి, కార్యాలయాలు లేకపోయినా టెంట్లు వేసుకునైనా సరే పాలన సాగిద్దామని పిలుపునిచ్చారని పవన్ కొనియాడారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకోవాల్సి రావడం, సరైన హైకోర్టు లేకపోవడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి రాజధాని కోసం రైతులు చూపిన చొరవను పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎక్కడా ఎలాంటి గొడవలు లేకుండా రైతులు సుమారు 33 వేల ఎకరాల భూమిని ఇష్టపూర్వకంగా ఇచ్చారని, కానీ 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై వైసీపీ కక్ష గట్టిందని ఆయన విమర్శించారు. రాజధాని రైతులకు మద్దతుగా వెళ్తే ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్నారని, వైకాపా హయాంలో శాసనసభ్యులకే రక్షణ లేని చోట సామాన్య రైతులకు భద్రత ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల పేరుతో సమస్యను పరిష్కరించకపోగా, మరింత కఠినం చేశారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో వైకాపా మళ్లీ వస్తే పరిస్థితి ఏంటని కొందరు అడుగుతున్నారని, అయితే వైకాపా మళ్లీ రాదని, ఒకవేళ వచ్చినా ఏమీ చేయలేదని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యమని, అప్పుడే పెట్టుబడులు వస్తాయని పవన్ స్పష్టం చేశారు. అమరావతి విషయంలో జనసేన పార్టీ ఎప్పుడూ మాట మార్చదని, రైతులకు అండగా నిలుస్తామని ఆయన పునరుద్ఘాటించారు. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేటప్పుడు కూడా చంద్రబాబుపై ఇలాంటి విమర్శలే వచ్చాయని, కానీ ఒక సాధారణ రాజకీయ నాయకుడు కేవలం ఎన్నికల గురించి ఆలోచిస్తే, ఒక దార్శనికుడు మాత్రం రాబోయే తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారని ఆయన పేర్కొన్నారు. చట్టసభల్లో కూర్చుని దాడులు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, అమరావతి కోసం మనమంతా ఒకే మాటపై నిలబడాలని పవన్ పిలుపునిచ్చారు.
