New Income Tax Rules: పన్ను కట్టేవారికి ,ముఖ్యంగా ప్రైవేట్ ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త ఆదాయపు పన్ను నియమాలు (Income Tax Rules 2026) అమల్లోకి రానున్నాయి. పాత పద్ధతుల స్థానంలో వస్తున్న ఈ కొత్త నిబంధనలు మీ జీతం, పొదుపు మరియు పన్ను లెక్కింపును పూర్తిగా మార్చబోతున్నాయి. మీరు పొందే గిఫ్ట్‌లు, ఆఫీసు భోజనం నుండి కంపెనీ ఇచ్చే ఇంటి వరకు ప్రతిదానిపై కొత్తగా పన్ను లెక్కలు ఉంటాయి.
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 10 ప్రధాన మార్పులు:
- రిటైర్మెంట్ ఫండ్స్ (PF/NPS): మీ కంపెనీ మీ పీఎఫ్ (PF) లేదా ఎన్‌పీఎస్ (NPS) ఖాతాల్లో జమ చేసే మొత్తం ఏడాదికి రూ. 7.5 లక్షలు దాటితే, ఆ పైన వచ్చే ఆదాయంపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- కంపెనీ ఇచ్చే ఇల్లు (Accommodation): మీరు కంపెనీ ఇచ్చిన ఇంట్లో ఉంటున్నట్లయితే, ఆ ఇంటి విలువను ఇకపై నగర జనాభా ఆధారంగా లెక్కిస్తారు. 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మీ జీతంలో 10% మొత్తాన్ని పన్ను పరిధిలోకి వచ్చే సౌకర్యంగా (Perquisite) గుర్తిస్తారు.
- అద్దె ఇల్లు (Rented Houses): ఒకవేళ కంపెనీయే ఒక ఇంటిని అద్దెకు తీసుకుని మీకు ఇస్తే, కంపెనీ కట్టే అసలు అద్దె లేదా మీ జీతంలో 10%… ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిపై పన్ను లెక్కిస్తారు.
- ఆఫీసు కారు (Company Cars): కంపెనీ మీకు కారు ఇస్తే, దాని ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి నెలకు పన్ను విలువను ఫిక్స్ చేశారు.
- 1.6 లీటర్ల ఇంజిన్ వరకు: నెలకు రూ. 5,000.
- అంతకంటే ఎక్కువ ఉంటే: నెలకు రూ. 7,000.
- డ్రైవర్ ఉంటే: అదనంగా రూ. 3,000 కలుపుతారు.
- కంపెనీ ఇచ్చే కానుకలు (Gifts & Vouchers): పండుగలకు లేదా ప్రత్యేక సందర్భాల్లో కంపెనీ ఇచ్చే గిఫ్ట్ వోచర్లు ఏడాదికి రూ. 15,000 లోపు ఉంటే పన్ను ఉండదు. ఒకవేళ ఆ విలువ రూ. 15,001 అయినా కూడా, మొత్తం మొత్తంపై పన్ను కట్టాల్సిందే.
- ఆఫీసులో ఉచిత భోజనం (Free Meals): ఆఫీసులో ఇచ్చే టీ, కాఫీ లేదా భోజనం విలువ ఒక్కో మీల్‌కు రూ. 200 లోపు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. అంతకంటే ఖరీదైన భోజనంపై పన్ను పడుతుంది.
- వడ్డీ లేని రుణాలు (Interest-free Loans): మీరు కంపెనీ నుండి వడ్డీ లేని లేదా తక్కువ వడ్డీకి అప్పు తీసుకుంటే, ఆ వెసులుబాటుపై పన్ను ఉంటుంది. దీనిని ఎస్‌బీఐ (SBI) వడ్డీ రేట్లతో పోల్చి లెక్కిస్తారు. అయితే, రూ. 2 లక్షల లోపు లోన్లకు మినహాయింపు ఉంది.
- ట్యాక్స్ ఫ్రీ ఆదాయంపై ఖర్చులు: కొన్ని పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉండదు. కానీ, ఆ ఆదాయాన్ని పొందడానికి మీరు చేసిన ఖర్చులను లెక్కించడానికి కొత్త ఫార్ములా తెచ్చారు. మీ సగటు పెట్టుబడిలో 1% ని ఖర్చుగా గుర్తిస్తారు.
- డిజిటల్ మరియు ఫారెక్స్ లావాదేవీలు: విదేశీ కరెన్సీ మార్పిడి మరియు డిజిటల్ లావాదేవీల విషయంలో పన్ను విధింపులో మరింత స్పష్టత ఇచ్చారు.
- కొత్త ఫార్మ్స్: కొత్త నిబంధనలకు అనుగుణంగా మీ ఫామ్-16 (Form-16) మరియు ఇతర పన్ను సంబంధిత పత్రాల్లో మార్పులు రానున్నాయి. ఏప్రిల్ 1 తర్వాత మీ శాలరీ స్లిప్‌లో ఇవి కనిపిస్తాయి.
