YS Vijayamma: వైఎస్సార్ కుటుంబంలో గత కొంతకాలంగా సాగుతున్న ఆస్తుల వివాదంపై ఆయన భార్య వైఎస్ విజయమ్మ స్పందించారు. తన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల యుద్ధంపై ఆమె ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ లేఖలో ఆమె అనేక కీలక విషయాలను వెల్లడించడమే కాకుండా, తన ఇద్దరు బిడ్డల మధ్య ఉన్న ఆస్తి పంపకాల అసలు నిజాన్ని బయటపెట్టారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులేనని, ఇప్పటివరకు అధికారికంగా ఆస్తుల పంపకం జరగలేదని ఆమె స్పష్టం చేశారు. తన మనవలు, మనవరాళ్లు అందరికీ ఆస్తులను సమానంగా పంచాలన్నదే వైఎస్సార్ ఆశయమని ఆమె గుర్తు చేశారు.
షర్మిలకు దక్కాల్సిన వాటా గురించి రాసిన ఒప్పందం (MOU)పై విజయమ్మ కీలక వివరణ ఇచ్చారు. నిజానికి ఆ ఒప్పందంలో రాసిన దానికంటే షర్మిలకు ఎక్కువ ఆస్తి దక్కాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. సరస్వతి సిమెంట్స్‌తో పాటు యెలహంకలోని భూమి కూడా షర్మిలకే చెందుతుందని వివరించారు. జగన్ తన సోదరికి ఇచ్చానని చెబుతున్న డబ్బు ఆస్తి పంపకం కిందకు రాదని, అది కేవలం ఆమెకు రావాల్సిన లాభాల్లో వాటా మాత్రమేనని విజయమ్మ స్పష్టం చేశారు. తన మేనల్లుడు, మేనకోడలికి ఇప్పటివరకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో జగన్ వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని ఒక తల్లిగా ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఆస్తుల విషయంలో సోషల్ మీడియాలో, బయట జరుగుతున్న ప్రచారాన్ని విజయమ్మ తీవ్రంగా ఖండించారు. గతంలో వైఎస్సార్ బ్రతికున్నప్పుడు జగన్‌కు కొన్ని ఆస్తులు ఇచ్చినట్లే, షర్మిలకు కూడా ఇచ్చారని.. కానీ దానిని పూర్తిస్థాయి ఆస్తి పంపకంగా చూడలేమని ఆమె వివరించారు. “నిజం ఏమిటో నా దేవుడికి తెలుసు, నా కొడుకు జగన్‌కు కూడా తెలుసు” అని ఆమె ఆవేదనతో పేర్కొన్నారు. అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిపై మండిపడుతూ, రాజకీయ ప్రయోజనాల కోసం తమ కుటుంబ విషయాలను వాడవద్దని ఆమె మీడియాను వేడుకున్నారు. దేవుని సాక్షిగా తాను రాసినవన్నీ అక్షర సత్యాలని ఆమె తన లేఖలో నొక్కి చెప్పారు.
