Bank Lockers: అందరూ తాము సంపాదించినా లేక కొనుగోలు చేసిన బంగారం లేదా ముఖ్యమైన పత్రాలు బ్యాంకు లాకర్లలో పెడుతూ ఉంటారు. లాకర్లలో పెట్టిన వస్తువులు సురక్షితంగా ఉంటాయి అని నమ్మకంగా ఉంటారు. కానీ బ్యాంకులు లాకర్లు మాత్రమే మనకి అద్దెకు ఇస్తాయి కానీ అందులో ఉన్న వస్తువులకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఇవ్వదనే విషయం తెలియదు. అయితే, ఒకవేళ ఏదైనా కారణం చేత లాకర్ లోని వస్తువులు మాయమైతే.. బ్యాంక్ పూర్తి బాధ్యత వహిస్తుందని మీరు అనుకుంటున్నారా? ఆర్బీఐ (RBI) నిబంధనల ప్రకారం, లాకర్ లోని వస్తువులకు బ్యాంకులు ఇచ్చే పరిహారం చాలా పరిమితం. ఈ నేపథ్యంలో మీ నగలను ఆర్థికంగా ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
మీ నష్టానికి బ్యాంక్ బాధ్యత ఎంత?
ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంక్ నిర్లక్ష్యం వల్ల గానీ, భవనం కూలిపోవడం వల్ల గానీ లేదా సిబ్బంది మోసం వల్ల గానీ లాకర్ లోని వస్తువులు పోతే బ్యాంకులు ఇచ్చే పరిహారానికి ఒక పరిమితి ఉంది. మీరు చెల్లించే వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్లు మాత్రమే బ్యాంక్ నష్టపరిహారంగా చెల్లిస్తుంది. మీరు ఏడాదికి రూ. 3,000 అద్దె కడుతుంటే, మీకు గరిష్టంగా రూ. 3 లక్షలు మాత్రమే పరిహారంగా అందుతాయి. మీ నగలు రూ. 20 లక్షలు లేదా రూ. 50 లక్షల విలువైనవైనా సరే, బ్యాంక్ బాధ్యత రూ. 3 లక్షలకే పరిమితం.
లాకర్ ఇన్సూరెన్స్: అదనపు రక్షణ
బ్యాంకులు లాకర్ లోని వస్తువులకు భీమా కల్పించవు కాబట్టి, పెద్ద మొత్తంలో నగలు ఉండేవారు విడిగా ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
-
వార్షిక ప్రీమియం: ఇన్సూర్ చేసే మొత్తం విలువలో సాధారణంగా 0.5% నుండి 1% వరకు ప్రీమియం ఉంటుంది. అంటే రూ. 10 లక్షల విలువైన నగలకు ఏటా రూ. 5,000 నుండి రూ. 10,000 వరకు ఖర్చవుతుంది.
-
ఏమి వర్తిస్తాయి?: దొంగతనం, అగ్నిప్రమాదం, మరియు వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టానికి ఈ భీమా రక్షణ ఇస్తుంది.
-
డాక్యుమెంటేషన్: ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే నగలకు సంబంధించిన బిల్లులు లేదా సర్టిఫైడ్ జ్యువెలర్ నుండి పొందిన విలువ ధ్రువీకరణ పత్రాలు (Valuation Certificates) తప్పనిసరి.
మీ నగలను కాపాడుకోవడానికి 3 చిట్కాలు
-
ఫోటోలు తీసి ఉంచండి: లాకర్లో నగలు పెట్టే ముందు వాటిని ఫోటోలు తీసి, వాటి బరువు మరియు విలువ వివరాలను డిజిటల్ రూపంలో (ఉదాహరణకు గూగుల్ డ్రైవ్ లేదా మెయిల్) భద్రపరుచుకోండి.
-
బిల్లులు భద్రం: బంగారం కొన్నప్పుడు ఇచ్చే ఒరిజినల్ బిల్లులను జాగ్రత్తగా ఉంచుకోండి. ఇవి ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో కీలక ఆధారాలుగా పనిచేస్తాయి.
-
పరిశీలన: ఏడాదికి కనీసం ఒకసారి మీ లాకర్‌ను సందర్శించి, వస్తువులను తనిఖీ చేసుకోండి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎక్కువ కాలం లాకర్‌ను ఆపరేట్ చేయకపోతే బ్యాంక్ దానిని సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది.
