Adilabad

Adilabad: 12 ఏళ్ల బాలుడి కిడ్నీలో ‘కొండంత’ రాయి.. ఆదిలాబాద్ రిమ్స్ వైద్యుల అద్భుతం!

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. సాధారణంగా కిడ్నీలో రాళ్లు అంటే కొన్ని మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటాయి. కానీ, ఇక్కడ ఒక చిన్నారి కిడ్నీలో ఏకంగా 200 గ్రాముల బరువున్న భారీ రాయిని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఇంత చిన్న వయసులో అంత పెద్ద రాయి ఏర్పడటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

సిరికొండ మండలం పాలవాగు గ్రామానికి చెందిన కొట్నక్ లింగు (12) అనే బాలుడు రిమ్మ ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. గత కొంతకాలంగా ఆ అబ్బాయికి కడుపులో తరచుగా నొప్పి వస్తుండేది. ఏదో మామూలు నొప్పే అనుకుని అప్పుడప్పుడు మాత్రలు వేసుకునేవాడు. అయితే మూడు రోజుల క్రితం స్కూల్లో ఉన్నప్పుడు నొప్పి విపరీతంగా పెరగడంతో, అక్కడి సిబ్బంది వెంటనే అతడిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

రిమ్స్‌లోని సూపర్ స్పెషాలిటీ విభాగం వైద్యులు బాలుడికి స్కానింగ్ చేయగా, ఎడమ కిడ్నీలో దాదాపు 6 సెంటీమీటర్ల వెడల్పు, 200 గ్రాముల బరువున్న ఒక పెద్ద రాయి ఉన్నట్లు బయటపడింది. యూరాలజీ నిపుణులు డాక్టర్ కె. కార్తీక్ కుమార్ నేతృత్వంలోని బృందం ఆపరేషన్ చేసి ఆ రాయిని విజయవంతంగా తొలగించారు. ఈ రాయి దాదాపు మూడేళ్ల నుంచి కిడ్నీలో పెరిగి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడు.

చిన్న పిల్లల్లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తగినంత నీరు తాగించడం, పోషకాహారం అందించడం ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. సకాలంలో స్పందించి ఆపరేషన్ చేసిన వైద్య బృందాన్ని బాలుడి తల్లిదండ్రులతో పాటు స్థానికులు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *