Narendra Modi: టాలీవుడ్ సెన్సేషనల్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఉదయ్‌పూర్‌లోని ప్రముఖ ఐటీసీ హోటల్లో అత్యంత వైభవంగా ఈ వేడుక జరగనుంది. అభిమానుల కోరిక మేరకు తమ పేర్లను కలిపి ‘విరోష్’ అని ఈ పెళ్లి వేడుకకు పేరు పెట్టడం విశేషం.
ఈ వివాహ వేడుక కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక పోలీసులతో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లిన ప్రత్యేక బృందాలు, అంతర్జాతీయ సెక్యూరిటీ సిబ్బంది కలిసి మూడు అంచెల భద్రతను పర్యవేక్షిస్తున్నారు. కేవలం వంద మంది అతిథుల సమక్షంలోనే ఈ పెళ్లి జరగనుంది. ఈ వేడుకకు రిలయన్స్ అధినేత అంబానీ కుటుంబం ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెళ్లి అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, అభిమానుల కోసం భారీ రిసెప్షన్ నిర్వహించనున్నారు.
మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ రాశారు. సప్తపదితో మొదలయ్యే వీరి ప్రయాణం జీవితాంతం స్నేహంగా, ఆనందంగా సాగాలని ఆయన ఆశీర్వదించారు. దంపతులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, బాధ్యతలను పంచుకుంటూ సాగాలని ప్రధాని తన సందేశంలో సూచించారు. ఇష్టమైన జంట ఒక్కటవుతుండడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు సందడి చేస్తున్నారు.
