TGSPDCL

TGSPDCL: టీజీఎస్పీడీసీఎల్ అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక వాట్సప్‌లోనే కరెంట్ కష్టాలకు చెక్!

TGSPDCL: తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ ఒక తీపి కబురు అందించింది. సాధారణంగా ఇంట్లో కరెంట్ పోయినా లేదా బిల్లులో ఏదైనా తప్పులు వచ్చినా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఆఫీసుల చుట్టూ తిరగడం, ఫోన్ చేస్తే కలవకపోవడం వంటి సమస్యలకు ఇక ముగింపు పలకనుంది. కేవలం ఒక్క వాట్సప్ మెసేజ్‌తో మీ సమస్యలను పరిష్కరించుకునేలా కొత్తగా ‘వాట్సప్ చాట్ బాట్’ సేవలను అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు.

విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం అధికారులు 8712441912 అనే వాట్సప్ నెంబర్‌ను కేటాయించారు. ఈ నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకుని, వాట్సప్ నుండి ‘Hi’ అని మెసేజ్ పంపితే చాలు.. వెంటనే మీకు కావాల్సిన సేవల వివరాలు కనిపిస్తాయి. దీని ద్వారా కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు, బిల్లు కట్టిన స్టేటస్‌ను చెక్ చేయవచ్చు. అంతేకాకుండా, మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎందుకు నిలిచిపోయిందో తెలుసుకోవడంతో పాటు, కొత్త ఫిర్యాదులను కూడా నమోదు చేయవచ్చు.

ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కరెంట్ బిల్లుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఈ సేవలు ఎంతో ఉపయోగపడతాయి. “మీ బిల్లు పెండింగ్‌లో ఉంది.. వెంటనే చెల్లించకపోతే కనెక్షన్ కట్ చేస్తాం” అంటూ సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ లింకుల బారిన పడకుండా, నేరుగా ఈ అధికారిక వాట్సప్ ద్వారా మీ బిల్లు వివరాలను నిర్ధారించుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో పనిచేసే ఈ చాట్ బాట్ వల్ల వినియోగదారులకు వేగంగా, పారదర్శకమైన సేవలు అందుతాయని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *