Summer Holidays 2026

Summer Holidays 2026: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు!

Summer Holidays 2026: రాష్ట్రంలో ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి. మొన్నటి వరకు చలితో వణికిపోయిన జనాలకు, ఇప్పుడు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మార్చి 16వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటలకే బడి మొదలై, మధ్యాహ్నం 12:30 గంటలకే ముగియనుంది. అయితే పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న చోట మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

మరోవైపు, విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే వేసవి సెలవుల ప్రకటన కూడా వచ్చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 48 రోజుల పాటు పిల్లలు సెలవుల్లో సరదాగా గడపవచ్చు. తిరిగి 2026-27 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. సెలవుల తేదీలు ముందుగానే తెలియడంతో చాలామంది తల్లిదండ్రులు తమ ఊర్లకు వెళ్లేందుకు ఇప్పుడే బస్సు, రైలు టికెట్లు బుక్ చేసుకునే పనిలో పడ్డారు.

ఇక రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఉర్దూ మీడియం పాఠశాలలకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. ముస్లిం విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉపవాస దీక్షల్లో ఉంటారు కాబట్టి, వారికి ఇబ్బంది కలగకుండా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. సిలబస్ పూర్తి చేసేందుకు అవసరమైతే వారంలో ఒక రోజు అదనపు తరగతులు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. మొత్తానికి ఎండల తీవ్రత పెరగకముందే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *