Supreme Court: మహిళలపై జరిగే లైంగిక వేధింపుల కేసుల్లో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును ఇచ్చింది. ఒక బాలిక వక్షస్థలాన్ని పట్టుకోవడం, ఆమె పైజామా దారాన్ని విప్పడం వంటి చర్యలు కేవలం వేధింపులు మాత్రమే కాదని, అవి స్పష్టంగా అత్యాచారయత్నం (Attempt to Rape) కిందకే వస్తాయని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ విషయంలో గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ, చట్టపరమైన తార్కికం – బాధితుల పట్ల సానుభూతి అవసరమని పేర్కొంది.
అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద తీర్పు
ఈ కేసు నేపథ్యం 2021లో ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 14 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లితో కలిసి వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి ఆమెను కల్వర్టు కిందకు లాగడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో బాలిక పైజామా నాడా లాగడం, ఆమె రోమ్మును తాకడం వంటి అమానుష చర్యలకు పాల్పడ్డారు. ఈ కేసుపై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు 2025 మార్చిలో వింతైన తీర్పునిచ్చింది. ఈ చర్యలు కేవలం రేప్ ముందు చేసే ప్రక్రియ (Preparation) మాత్రమే అని, వీటిని అత్యాచారయత్నంగా పరిగణించలేమని పేర్కొంటూ నిందితులపై సెక్షన్లను తగ్గించింది.
సుప్రీంకోర్టు ఘాటు స్పందన
ఆ సమయంలో హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో, సుప్రీంకోర్టు దీనిని సుమోటో (Suo Motu) గా విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చీ, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం ఈ క్రింది కీలక వ్యాఖ్యలు చేసింది:
నిందితులు బాలికను కల్వర్టు కిందకు లాగడం, ఆమె బట్టలు విప్పడానికి ప్రయత్నించడం వంటివి చూస్తుంటే వారి ఉద్దేశం స్పష్టంగా అత్యాచారం చేయడమేనని కోర్టు పేర్కొంది. ఈ కేసులో నిందితులపై అత్యాచారయత్నం అభియోగాలను తిరిగి పునరుద్ధరించాలని ఆదేశించింది. లైంగిక నేరాల కేసుల్లో తీర్పులు ఇచ్చేటప్పుడు చట్టాన్ని యాంత్రికంగా కాకుండా, బాధితురాలి కోణంలో చూడాలని హైకోర్టును మందలించింది.
తీర్పు ప్రాముఖ్యత
భారతదేశంలో మహిళల రక్షణ కోసం ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేసేలా ఈ తీర్పు ఉంది. “కేవలం తాకడం అత్యాచారం కాదు” అనే సాంకేతిక కారణాలతో నిందితులు తప్పించుకోకుండా, వారి ఉద్దేశం (Intent) ఇంకా వారు చేసిన ప్రయత్నాన్ని బట్టి శిక్షలు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు భవిష్యత్తులో దిగువ కోర్టులకు లైంగిక వేధింపుల కేసుల్లో ఒక మార్గదర్శకంగా నిలవనుంది.
