Telangana Municipal Chairman Winners: తెలంగాణవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మున్సిపల్ చైర్మన్లు – మేయర్ల ఎన్నిక ప్రక్రియ నేడు (ఫిబ్రవరి 16) విజయవంతంగా ముగిసింది. కరీంనగర్, నిజామాబాద్, నల్లగొండ వంటి ప్రధాన కార్పొరేషన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా, కరీంనగర్ వంటి చోట్ల బీజేపీ, గజ్వేల్ వంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్ తమ పట్టును నిరూపించుకున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి పట్టణాల్లో వినూత్న రాజకీయ సమీకరణల మధ్య కొత్త సారథులు బాధ్యతలు చేపట్టారు.
కార్పొరేషన్లలో ప్రధాన విజయాలు
- కరీంనగర్ (MCK): కరీంనగర్ కార్పొరేషన్ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ అభ్యర్థి కొలగాని శ్రీనివాస్ 34 ఓట్లతో మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా యాదగిరి సునీల్ రావు బాధ్యతలు చేపట్టారు.
- నిజామాబాద్: ఇక్కడ రాజకీయ చిత్రం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, ఎంఐఎం – బీఆర్ఎస్ సభ్యుల మద్దతుతో కూరగాయల ఉమారాణి (ముదిరాజ్) మేయర్‌గా ఎన్నికయ్యారు.
- నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఎన్నికై చరిత్ర సృష్టించారు.
మున్సిపాలిటీలలో పార్టీల బలాబలాలు
- కాంగ్రెస్ జోరు: హుస్నాబాద్‌లో దండి లక్ష్మీ కొమురయ్య, వర్ధన్నపేటలో పాలకుర్తి సారంగపాణి, పరకాలలో పావుశెట్టి సునీల్ కుమార్ చైర్మన్లుగా ఎన్నికై కాంగ్రెస్ పట్టును నిరూపించారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో గద్వాల, ఆత్మకూరు, వనపర్తి వంటి మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
- బీఆర్ఎస్ పట్టు: మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగిశెట్టి చందన చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, గుమ్మడిదల మరియు ఆసిఫాబాద్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ దక్కించుకుంది.
- ఏకగ్రీవ ఎన్నికలు: సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీలో ముస్తాల అరుణ (చైర్మన్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఆసక్తికర సమీకరణలు మరియు వాయిదాలు
ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష కాంగ్రెస్, ఎంఐఎం మద్దతుతో దక్కించుకున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో కాంగ్రెస్-ఎంఐఎం పొత్తు పొడవగా, ఆమనగల్లో కాంగ్రెస్-బీజేపీ సభ్యులు కలిసి పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం విశేషం. అయితే, జనగామ మున్సిపాలిటీలో కౌన్సిలర్ కిడ్నాప్ వివాదం – గందరగోళం కారణంగా ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది.
