East Godavari: తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి హల్‌చల్..

East Godavari: తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామస్తులు పెద్దపులి సంచారంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. శుక్రవారం ఉదయం గ్రామంలోని ఒక పాడుబడిన ఇంట్లో పులి గాండ్రింపులు వినిపించడంతో అప్రమత్తమైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలించగా, ఆ పాత ఇంట్లోనే పులి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే పులిని బంధించేందుకు నిపుణులు, అటవీ సిబ్బంది రంగంలోకి దిగి ఆ ఇంటి చుట్టూ బోన్లు ఏర్పాటు చేశారు. మత్తు ఇంజక్షన్‌ షూట్ చేసి పులిని పట్టుకోవాలని చూస్తున్న క్రమంలో అది బెదిరిపోయి ఒక్కసారిగా ఆ పాడుబడిన ఇంటి నుండి బయటకు దూకింది. పాడుబడిన ఇంటి నుండి బయటకు వచ్చిన పులి కూర్మాపురం నుండి ఎండగంటి వైపు పరుగులు తీయడంతో ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలోనే ఆ పెద్దపులి కూర్మాపురంలో ఒక దూడను చంపి తినేసింది. పులి గాండ్రింపులు, దాని కదలికలతో ఆ ప్రాంతమంతా గజగజ వణికిపోతోంది. అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూనే, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొలాల వైపు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *