Delhi

Delhi: ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం.. గుంతలో పడి యువ బ్యాంక్ మేనేజర్ మృతి

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల నిర్లక్ష్యం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. జనక్‌పురి ప్రాంతంలో ఢిల్లీ జల్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా, కనీస హెచ్చరిక బోర్డులు లేకుండా వదిలేసిన గుంత ఒక యువ బ్యాంక్ మేనేజర్‌కు మృత్యుపాశమైంది. రోహిణిలోని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న కమల్, ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి విధి నిర్వహణ ముగించుకుని తన బైక్‌పై ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రోడ్డుపై తవ్విన లోతైన గుంత చుట్టూ ఎలాంటి బారికేడ్లు లేకపోవడంతో, చీకటిలో దానిని గమనించని కమల్ బైక్‌తో సహా అందులో పడిపోయారు. రాత్రంతా ఆయన ఆ గుంతలోనే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ, అటుగా వెళ్లేవారు ఎవరూ గమనించకపోవడం విషాదకరం. కమల్ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు రాత్రంతా పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా అధికారులు సకాలంలో స్పందించలేదని బాధితుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకవేళ పోలీసులు వెంటనే గాలింపు చేపట్టి ఉంటే తమ కుమారుడు బతికేవాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరుసటి రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో వెలుగు రావడంతో స్థానికులు గుంతలో పడి ఉన్న బైక్‌ను, మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఢిల్లీలో రాజకీయ దుమారం రేగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని, అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని మండిపడ్డారు. పనులు జరుగుతున్నప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *