AP News: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు అమరావతిలో భేటీ కానున్నారు. ఉదయం 10.40 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సుమారు గంటన్నర పాటు సాగే ఈ సమావేశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతికి చేరుకోనున్న పవన్, సీఎంతో కలిసి రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఈ భేటీలో ప్రధానంగా తిరుమల లడ్డూ కల్తీ అంశం చర్చకు రానుంది. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై టీడీపీ, వైసీపీ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. నిన్నటి కేబినెట్ భేటీలో ఇప్పటికే దీనిపై సిట్ నివేదిక గురించి చర్చించారు. అయితే కేవలం టీడీపీ మాత్రమే కాకుండా, కూటమిలోని జనసేన, బీజేపీలు కూడా కలిసి ఈ అంశంపై ఉమ్మడి పోరాటం చేయాలని సీఎం భావిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజల్లోకి ఈ అంశాన్ని ఎలా తీసుకెళ్లాలి? కూటమి నేతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే దానిపై పవన్‌తో చంద్రబాబు చర్చించనున్నారు.
మరోవైపు, త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల పంపకాలపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి లెక్కల ప్రకారం టీడీపీకి రెండు, జనసేనకి ఒకటి, బీజేపీకి ఒకటి చొప్పున కేటాయించే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. దీనితో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు, త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే వీలుంది. పాలనలో మరింత వేగం పెంచేలా ఇద్దరు నేతలు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
అదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన కూడా చర్చకు రానుంది. అంబటి రాంబాబు నివాసంపై దాడి నేపథ్యంలో జగన్ అక్కడ పర్యటిస్తుండటంతో, శాంతిభద్రతల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై వీరు చర్చించనున్నారు. జగన్ పర్యటనలకు ధీటుగా పవన్ కల్యాణ్ కూడా జిల్లాల పర్యటనలు చేయాలా? లేదా కూటమిగా కలిసి ముందుకెళ్లాలా? అనే కోణంలో కార్యాచరణ రూపొందించనున్నారు. మొత్తం మీద ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులకు వేదిక కానుంది.
