Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం తన పదవి నుంచి కిందకు దించుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు డీఎస్పీ హోదాలో ఉన్న ఆయనను తిరిగి ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2007 బ్యాచ్‌కు చెందిన ప్రణీత్ రావుకు గతంలో లభించిన ప్రత్యేక పదోన్నతిని రద్దు చేయడంతో ఆయన ఇకపై ఇన్‌స్పెక్టర్‌గానే కొనసాగాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రణీత్ రావు, అప్పట్లో రాజకీయ నాయకులు మరియు ప్రజాప్రతినిధుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిగింది. ఈ విచారణలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు ఆధారాలు లభించడంతో తొలుత ఆయనను సర్వీస్ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ఆయన హోదాను తగ్గిస్తూ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.
విచారణలో భాగంగా సిట్ అధికారులు దిగ్భ్రాంతికరమైన విషయాలను గుర్తించారు. 2023 నవంబర్ 15న ఒక్క రోజే ఏకంగా 650 ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు తేలింది. ముఖ్యంగా రాజకీయ నాయకుల ఫోన్ నంబర్లను మావోయిస్టుల పేర్లతో రివ్యూ కమిటీకి పంపించి, అనుమతులు తీసుకుని ఈ ట్యాపింగ్ కొనసాగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ప్రణీత్ రావుతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత్రపై కూడా సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు.
