Pawan Kalyan: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల వేడి ఒక్కసారిగా పెరిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 7, 8 తేదీల్లో ఆయన తెలంగాణలో పర్యటించి, బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించనున్నారు.
ఈ పరిణామాల వెనుక కీలక రాజకీయ భేటీ జరిగింది. నిన్న రాత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత రాంచందర్ రావు స్వయంగా పవన్ కల్యాణ్‌ను కలిశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి అండగా నిలవాలని, ప్రచారానికి రావాలని వారు కోరారు. ఇందుకు పవన్ సానుకూలంగా స్పందించారు. కేవలం మద్దతు తెలపడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అయితే, ఈ ఎన్నికల్లో పొత్తుల విషయంలో జనసేన ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. కొన్ని చోట్ల రెండు పార్టీలు కలిసి పని చేసినా, మరికొన్ని చోట్ల “స్నేహపూర్వక పోటీ” ఉంటుందని జనసేన పార్టీ అధికారికంగా ట్వీట్ చేసింది. అంటే, ఎక్కడైతే అభ్యర్థుల మధ్య గట్టి పోటీ ఉంటుందో అక్కడ ఇరు పార్టీల నేతలు స్నేహపూర్వక వాతావరణంలోనే తలపడతారని స్పష్టమైంది.
పవన్ కల్యాణ్ ఎంట్రీతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ముఖచిత్రం మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత మరియు జనసేన కార్యకర్తల మద్దతు బీజేపీకి కలిసొచ్చే అంశమని చెప్పవచ్చు. మరి రెండు రోజుల పాటు సాగనున్న ఈ ప్రచార పర్వం ఓటర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
