jagtial:జగిత్యాల కాంగ్రెస్‌లో మళ్లీ అగ్గి రాజుకున్నది. మున్సిపల్ ఎన్నికల వేళ విభేదాలు మరింత ముదిరిపాకాన పడ్డాయి. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వర్గం మధ్య వైరం భగ్గుమన్నది. తమ వర్గానికి తీరని అన్యాయం చేశారంటూ జీవన్‌రెడ్డి వర్గం ఆరోపణలు గుప్పించింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ వద్ద ఎమ్మెల్యేపై, ఆయన వర్గంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
jagtial:జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో 50 వార్డులు ఉన్నాయి. వాటిలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30, జీవన్‌రెడ్డి వర్గానికి 20 సీట్లను కేటాయిస్తూ సమన్వయ కమిటీ నిర్ణయించింది. దీంతో ఎమ్మెల్యే సంజయ్‌పై జీవన్‌రెడ్డి వర్గీయులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరా భవన్ ఎదుట తీవ్రంగా దుర్భాషలాడుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వారికి టికెట్లు ఇచ్చి, కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి ఉన్న తమకు తీరని అన్యాయం చేస్తారా? అంటూ రెచ్చి పోయారు.
jagtial:కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లు మొదటి నుంచి తమకు ఇవ్వకుండా, నిన్నగాక మొన్న బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు ఎలా ఇస్తారు? అంటూ జీవన్‌రెడ్డి వర్గీయులు నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్ తమ పొట్టలు కొట్టాడంటూ దుర్భాషలాడుతూ, ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
