Shehbaz Sharif: పాకిస్థాన్ దేశం ఎదుర్కొంటున్న దయనీయ ఆర్థిక పరిస్థితులపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. దశాబ్దాలుగా అభివృద్ధిని పక్కనపెట్టి, పొరుగు దేశం భారత్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా నిధులు మళ్లించడం, ఉగ్రవాదానికి ఊతమివ్వడం వంటి చర్యలు ఆ దేశాన్ని కోలుకోలేని అప్పుల ఊబిలోకి నెట్టేశాయి. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఒక వాణిజ్య సదస్సులో వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించిన షరీఫ్, దేశ ఆర్థిక దుస్థితిపై తన ఆవేదనను కక్కారు.
డబ్బు కోసం ప్రపంచ దేశాల ముందు చెయ్యి చాపడం తనకు, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు ఎంతో అవమానకరంగా ఉందని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. “అప్పు అడిగే వాడి తల ఎప్పుడూ వంగే ఉంటుంది. మేమిద్దరం కలిసి అత్యంత రహస్యంగా మిత్ర దేశాల వద్దకు వెళ్లి బిలియన్ డాలర్ల సాయం కోరాల్సి వచ్చింది. అలా అడుక్కోవాల్సి రావడం మా ఆత్మగౌరవానికి పెద్ద దెబ్బ. అప్పు ఇచ్చే వారు పెట్టే కఠినమైన షరతులను కాదనలేని దుస్థితిలో మనం ఉన్నాం” అంటూ ఆయన దేశ పరిస్థితిని వివరించారు. ఈ సంక్షోభ సమయంలో చైనా, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు అందించిన ఆర్థిక వెన్నుదన్ను వల్లే పాక్ ఇంకా దివాళా తీయకుండా మనుగడ సాగిస్తోందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలోని అంతర్గత పరిస్థితులు కూడా అత్యంత భయానకంగా ఉన్నాయి. 2018లో కేవలం 21.9 శాతంగా ఉన్న పేదరికం, ప్రస్తుతం ఏకంగా 45 శాతానికి చేరుకుంది. సుమారు 80 లక్షల మంది యువత ఉపాధి లేక నిరుద్యోగులుగా మిగిలిపోయారు. టెక్స్టైల్ రంగం మినహా మిగిలిన పరిశ్రమలన్నీ కుదేలయ్యాయి. గతంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయాల్సి రావడం అనే విషవలయంలో పాకిస్థాన్ చిక్కుకుపోయింది. ఇదే క్రమంలో ఐఎంఎఫ్ (IMF) నుండి 23వ సారి రుణం పొందేందుకు ఆ సంస్థ విధించిన కఠిన నిబంధనలకు పాక్ తలొగ్గాల్సి వచ్చింది.
మరోవైపు, దేశ పాలనలో సైన్యం పాత్రపై కూడా షరీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రస్తుతం ‘హైబ్రిడ్ పాలన’లో ఉందని, దేశాన్ని ఆర్థికంగా నిలబెట్టడంలో ఆర్మీ చీఫ్ మునీర్ 100 శాతం సహకరిస్తున్నారని పేర్కొన్నారు. పెట్రోల్ స్మగ్లింగ్ అరికట్టడం వంటి పౌర విధుల్లో సైన్యం జోక్యం చేసుకోవడాన్ని ఆయన సమర్థించారు. కేవలం విదేశీ సాయంపై ఆధారపడకుండా, స్వదేశీ ఉత్పత్తులను పెంచుకుంటే తప్ప పాకిస్థాన్‌కు భవిష్యత్తు లేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశ ప్రధాని నోటి నుండే ఇన్ని చేదు నిజాలు బయటకు రావడంతో పాక్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రపంచానికి స్పష్టమైంది.
