Tammareddy: తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మరోసారి చర్చ వేడెక్కింది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని వ్యాఖ్యానించగా, గాయని చిన్మయి ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వేధింపులు ఉన్నాయని బహిరంగంగా చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తమ్మారెడ్డి, సినీ పరిశ్రమలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరని స్పష్టం చేశారు. తన అనుభవం ప్రకారం పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ వందశాతం ఉందని, అయితే అందరూ ఇలా వ్యవహరిస్తున్నారని మాత్రం చెప్పలేమని అన్నారు. ఇది ఈరోజు సమస్య మాత్రమే కాదని, తెలుగు సినిమా ప్రారంభమైనప్పటి నుంచే ఈ సమస్య కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు సినీ పరిశ్రమలోకి రాజులు, జమీందారులు వచ్చేవారని, వారిలో కొందరు మహిళల కోసమే సినిమాలు తీసేవారని తమ్మారెడ్డి గుర్తు చేశారు. కాలక్రమేణా పరిస్థితులు మారినా, మహిళలను వాడుకునే ధోరణి పూర్తిగా అంతరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 250 సినిమాలు నిర్మితమవుతుంటే, అందులో సుమారు 30 నుంచి 40 సినిమాలు మాత్రమే ఇలాంటి దృష్టితో తెరకెక్కుతున్నాయని చెప్పారు. ఇది కాదనలేని వాస్తవమని స్పష్టంగా తెలిపారు.
Also Read: Eesha rebba: త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు.. ఈషా షాకింగ్ కామెంట్స్
క్యాస్టింగ్ కౌచ్‌పై చిన్మయి చేసిన వ్యాఖ్యలు నిజమేనని తమ్మారెడ్డి బలంగా సమర్థించారు. పరిశ్రమలో ఒకరిద్దరు పెద్దల్లో లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, టాలెంట్ ఉన్నవారిని ఎవరూ ఏమీ చేయలేరని, ప్రతిభ లేని వాళ్లే ఇలాంటి ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తుందని అన్నారు. ధైర్యంగా ఎదురు తిరిగిన వారిని వేధిస్తే చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా చిన్మయి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తమిళనాడులో ధైర్యంగా మాట్లాడినందుకు ఆమెను అక్కడ బ్యాన్ చేశారని, ఏడాది తర్వాత మళ్లీ కార్డు ఇచ్చారని గుర్తు చేశారు. సస్పెండ్ అయిన వారికి తిరిగి కార్డు ఇవ్వడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ఇలా చేయడం వల్ల నిజంగా పోరాడిన వారికి న్యాయం జరగదని అన్నారు.
తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మరోసారి సినీ పరిశ్రమలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.
