Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 2 లేన్ల జాతీయ రహదారులను 4 లేన్లుగా విస్తరించేందుకు తక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర రహదారుల నెట్వర్క్ విస్తరణ, రోడ్ డెన్సిటీ పెంపు, కొత్త రహదారుల నిర్మాణం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం కొనసాగుతున్న జాతీయ రహదారి ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించి, మరింత వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. రహదారుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఒక బెంచ్‌మార్క్‌గా నిలవాలని, పనుల్లో నాణ్యత మరియు వేగం రెండింటినీ పాటించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ (NHAI)కు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రోడ్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు.
