Keesara Accident: ప్రజల్లో రోజు రోజుకీ మానవత్వం స్థానంలో సంచలనాత్మక పోకడలు ఎక్కువ అయిపోతున్నాయి. టెక్నాలజీ పెరిగి.. ప్రపంచం అంతా మునివేళ్ళపైకి వచ్చేస్తుంటే.. తోటి మనిషి కష్టంలో ఉన్నా.. ఆ మునివేళ్లతో అతని కష్టాన్ని ప్రచారం చేసే ఆత్రుత ఎక్కువైపోయింది. చావు బతుకుల్లో అవతల వ్యక్తి ఉన్నా.. ఆ పరిస్థితిని సెల్ ఫోన్స్ లో బంధించి.. సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు ఇస్తున్న ఇంపార్టెన్స్.. ఆ వ్యక్తిని రక్షించడానికి ఏమి చేయాలనే విషయంపై లేకపోతుండడం విషాదం. ఇప్పుడు చెబుతున్నది ఏదో అలా చెప్పేయడం లేదు. జరుగుతున్న సంఘటనలు మనిషిలో పెరుగుతున్న ప్రచార కండూతిని కళ్ళకు కడుతున్నాయి.
ఇదిగో తాజాగా అందుకు ఒక ఉదాహరణ లాంటి సంఘటన జరిగింది. అది హైదరాబాద్ కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద సర్వీస్ రోడ్డు మీద ఒక వ్యక్తి పడి ఉన్నాడు. పడి ఉండడం అంటే మామూలుగా కాదు.. రెండు కాళ్ళు దెబ్బలతో.. రక్తం ఓడుతూ.. కనిపించిన వారందరినీ హెల్ప్.. హెల్ప్ అని అడుగుతూ దైన్యంగా ఉన్నాడు. అక్కడ చుట్టూ జనం ఉన్నారు. దాదాపుగా అందరి చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ వ్యక్తిని.. పరిసరాలను సినిమాటోగ్రాఫర్స్ రేంజిలో సెల్ ఫోన్ లో షూట్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఐదు.. పది.. ఇరవై నిమిషాలు గడిచిపోయాయి.
రక్షించమని అడుగుతూ ఆ వ్యక్తి అలసిపోయాడు. అప్పుడు వచ్చింది 108. అప్పుడు కూడా చుట్టూ జనం.. చేతిలో సెల్ ఫోన్స్.. కట్ చేస్తే అంబులెన్స్ ఆ వ్యక్తిని తీసుకుని ఆసుపత్రికి చేరుకుంది. అక్కడ డాక్టర్లు చలనం లేని ఆ వ్యక్తిని పరీక్షించారు. అప్పటికే.. ఆయన ప్రాణాలు గాలిలో కాదు.. కాదు.. సెల్ ఫోన్ వీడియోల్లో కలిసిపోయాయి. అదే విషయాన్ని డాక్టర్లు నిర్ధారించారు.
ఇది కూడా చదవండి: Air India Flight: విమానంలో మహిళకు వేధింపులు.. యువకుడి అరెస్ట్
అసలేం జరిగింది?
కీసర అవుటర్ రింగు రోడ్డు వద్ద బుధవారం ఈ దుర్ఘటన జరిగింది. కీసర సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ కు చెందిన వి. ఏలేందర్ (35) కీసర సమీప రాంపల్లి చౌరస్తాలో నివాసం ఉంటున్నారు. బుధవారం సాయంత్రం కీసరలో తాను నిర్మిస్తున్న ఇంటిని చూసేందుకు స్కూటీపై వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఎలేందర్ రోడ్డుపై పడిపోగా.. స్థానికులు గమనించి కేకలు వేశారు. దీంతో డ్రైవర్ లారీని ఒక్కసారిగా రివర్స్ చేయడంతో లారీ చక్రాలు ఎలేం దర్ కాళ్ల పైకి ఎక్కాయి.
ఈ క్రమంలో రెండు కాళ్లు నుజ్జునుజ్జయి తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడిపోయాడు ఏలేందర్. తనను కాపాడమని కనిపిస్తున్న జనాలను ప్రాధేయపడటం మొదలు పెట్టాడు. అక్కడ ఉన్న జనం 108కు కాల్ చేసి.. బాధితుడిని ఫొటోలు తీస్తూ కాలక్షేపం చేశారు. కాసేపటికి 108 వాహనం రాగా.. ఈసీఐఎల్ చౌరస్తా లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే బాధితుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏలేందర్ కు భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. లారీ డ్రైవర్ లక్ష్మ ణ పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అదీ జరిగింది. అక్కడ చేరిన జనంలో ఏ ఒక్కరు సరిగా స్పందించినా.. ఏలేందర్ ప్రాణాలను కాపాడగలిగే వారు. 108 వస్తుందని ఎదురు చూస్తూ.. ఫోటోలు తీస్తూ ఉన్న ప్రజల్లో ఏ ఒక్కరు కాస్త తెలివిగా ఆలోచించినా ఇద్దరు చిన్నారులు తండ్రిలేని వారు అయ్యేవారు కాదు. ఇది నిజం.