Putin: ప్రపంచ అగ్రశ్రేణి శక్తుల్లో భారత్‌కు సరైన స్థానం ఉంది

Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు విశేష గౌరవం ఉందని, ప్రపంచంలోని అగ్రశ్రేణి శక్తులలో భారత్‌కు సముచిత స్థానం ఉందని ఆయన ప్రశంసించారు. సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధించిన ప్రగతిని ప్రపంచం గుర్తిస్తోందని తన సందేశంలో పేర్కొన్నారు.

గతేడాది డిసెంబర్‌లో భారత్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీతో జరిపిన సమావేశాన్ని పుతిన్ గుర్తు చేసుకున్నారు. ఆ చర్చలు ఇరు దేశాల మధ్య ఉన్న ప్రత్యేక, విశేషాధికార వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేశాయని తెలిపారు. భారత్–రష్యా సంబంధాలు కాలపరీక్షకు నిలిచాయని, ద్వైపాక్షిక సహకారం రెండు దేశాల ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

భారత్, రష్యా కలిసి అన్ని రంగాల్లో సహకారాన్ని కొనసాగిస్తామని, ఇది న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థ నిర్మాణానికి దోహదం చేస్తుందని పుతిన్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రజలందరికీ సుఖసంతోషాలు, శ్రేయస్సు కలగాలని కోరుతూ తన సందేశాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *