Muralimohan: ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడైనా వచ్చింది

Muralimohan: టాలీవుడ్ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళీమోహన్‌కు 2026 పద్మశ్రీ పురస్కారం దక్కడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అవార్డు ప్రకటించినప్పటి నుంచి మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని పేర్కొన్నారు. “మీకు ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడైనా వచ్చింది” అని అనేవారికి “లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది” అని సరదాగా సమాధానం ఇచ్చానని అన్నారు.

ఈ గౌరవాన్ని అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, అలాగే సినిమా పరిశ్రమ ప్రముఖులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు అందుకున్న తర్వాత పూర్తి వివరాలతో ప్రెస్‌మీట్ నిర్వహిస్తానని చెప్పారు.

1940 జూన్ 24న జన్మించిన మురళీమోహన్, 1973లో ‘జగమే మాయ’ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసి, 1974లో ‘తిరుపతి’ సినిమాతో గుర్తింపు పొందారు. క్రమశిక్షణ గల నటుడిగా పేరు తెచ్చుకున్న ఆయన 350కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా కూడా తన బహుముఖ ప్రతిభను చూపించారు.

నిర్మాతగా జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై 25కి పైగా సినిమాలు నిర్మించి, ‘అతడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు అందించారు. మూడు నంది అవార్డులు అందుకున్నారు. అలాగే ఎన్‌ఎఫ్‌డీసీ, ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో కీలక పదవులు నిర్వహించారు.

సినిమాతో పాటు రాజకీయాల్లో కూడా రాణించిన మురళీమోహన్, టీడీపీ తరఫున 2014లో రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిచి లోక్‌సభలో అడుగుపెట్టారు. విద్య, వైద్య రంగాల్లో సామాజిక సేవలు చేశారు. మాగంటి మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించారు. ఈ ట్రస్ట్ ద్వారా దాదాపు 10 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

ఈ విధంగా సినిమా, రాజకీయ, సేవా రంగాల్లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా మురళీమోహన్‌కు పద్మశ్రీ పురస్కారం లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *