Sun God:

Sun God: రథసప్తమి రోజున పరమాన్నం ఎందుకు వండుతారు? పూర్తి వివరాలు ఇవే!

Sun God: సూర్య భగవానుడు కేవలం వెలుగునిచ్చే గ్రహం మాత్రమే కాదు, ఈ జగత్తుకు ప్రాణదాత మరియు ఆరోగ్య ప్రదాత. మనం నిత్యం చూసే సూర్యుడు ఉదయం బ్రహ్మ దేవుడిగా, మధ్యాహ్నం మహేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా పూజలందుకుంటాడు. పురాణాల ప్రకారం, అదితి మరియు కశ్యపుల సంతానంగా మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు జన్మించాడు. ఆ పవిత్ర దినాన్ని మనం ‘రథసప్తమి’ (2026 జనవరి 25) గా జరుపుకుంటాం.

రథసప్తమి రోజున సూర్యుడు తన రథం దిశను మార్చుకుంటాడు. ఈ రోజున ఆకాశం కూడా రథాకారంలో కనిపిస్తుందని భక్తుల నమ్మకం. సూర్యుడిని ‘భాస్కరుడు’ అని కూడా అంటారు. ‘భాసం’ అంటే ప్రకాశం, ‘కరుడు’ అంటే చేసేవాడు. అంటే ప్రపంచాన్ని చీకటి నుండి వెలుగు వైపు నడిపించేవాడే భాస్కరుడు. మన ఆరోగ్యం, చైతన్యం అన్నీ ఆ సూర్య శక్తిపైనే ఆధారపడి ఉన్నాయి.

రథసప్తమి రోజున పాటించాల్సిన ముఖ్యమైన విధులు:

  • స్నాన విధి: ఈ రోజు తెల్లవారుజామునే నదులలో స్నానం చేయడం విశేషం. మగవారు తల మీద ఏడు జిల్లేడు ఆకులను, ఆడవారు ఏడు చిక్కుడు ఆకులను ఉంచుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్యాలు తొలగి, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.

  • దీప దానం: నదీ తీరాలలో దీపాలను వెలిగించి నీటిలో వదలాలి. ఇంట్లో ఆవు నేతితో దీపారాధన చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

ఇది కూడా చదవండి: Harish Rao: భట్టి గారూ.. స్కామ్ జరగకపోతే టెండర్లు ఎందుకు రద్దు చేశారు?

  • పరమాన్నం నివేదన: ఇంటి ముందు తూర్పు దిక్కున ఆవు పేడతో అలికి, పిండితో పద్మం వేయాలి. అక్కడ కొత్త పొయ్యి పెట్టి, సంక్రాంతి పిడకలతో పాలు పొంగించి, కొత్త బియ్యం, బెల్లంతో పరమాన్నం తయారు చేయాలి.

  • చిక్కుడు రథం: చిక్కుడు కాయలతో చిన్న రథాన్ని చేసి, చిక్కుడు ఆకులపై పరమాన్నం ఉంచి సూర్య భగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు ఎర్రటి పూలతో పూజించడం మరింత శ్రేష్ఠం.

రథసప్తమి రోజున ఉపవాసం ఉండి సూర్యారాధన చేసేవారికి మృత్యుభయం పోవడమే కాకుండా, వారు చేసే పనులు విజయవంతం అవుతాయి. ముత్తయిదువులు తమ నోములకు, వ్రతాలకు ఈ రోజునే అంకురార్పణ చేస్తారు. ప్రత్యక్ష దైవమైన సూర్యుడిని ఆరాధించడం వల్ల వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యం నిలకడగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *