Aircraft crash: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం ఒక మిలిటరీ శిక్షణ విమానం (మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రమాదానికి గురైంది. సాధారణ శిక్షణలో భాగంగా గాలిలో చక్కర్లు కొడుతున్న సమయంలో సాంకేతిక కారణాల వల్ల ఈ విమానం ఒక్కసారిగా అదుపు తప్పి కిందకు పడిపోయింది. స్థానిక కేపీ కాలేజీ సమీపంలో ఉన్న ఒక చెరువులో ఈ ఆర్మీ విమానం కూలిపోయిందని అధికారులు ధృవీకరించారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. అదృష్టవశాత్తూ, విమానం కూలిపోవడానికి ముందే వారు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. చెరువులో విమానం పడటంతో సమీపంలోని జనావాసాలకు గానీ, ప్రజల ఆస్తులకు గానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదు. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ దళాలు మరియు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
అయితే, ఈ విమానం కూలిపోవడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఎయిర్ ఫోర్స్‌కు చెందిన శిక్షణ విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై లోతైన విచారణ జరిపి, అసలు లోపాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలని ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
