Gold Price Today: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మీకు కాస్త ఇబ్బంది కలిగించేదే. గత కొద్ది రోజులుగా పసిడి ధరలు అస్సలు తగ్గడం లేదు సరే కదా.. రోజురోజుకూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఎప్పుడు తగ్గుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు నిరాశే ఎదురవుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, యుద్ధ మేఘాలు వంటి కారణాల వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మన దేశీయ మార్కెట్‌లో కూడా ధరలకు రెక్కలు వచ్చాయి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల పరిస్థితి చూస్తే.. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,790 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే ధర స్వల్పంగా పెరిగింది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,37,310 వద్ద ఉంది. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో ఈ స్థాయిలో ధరలు ఉండటం మధ్యతరగతి ప్రజలకు పెద్ద భారంగా మారింది.
దేశంలోని ఇతర నగరాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,920 ఉండగా, చెన్నైలో అత్యధికంగా రూ.1,51,650 వద్ద ట్రేడ్ అవుతోంది. గడిచిన వారం రోజుల్లోనే వేలల్లో ధరలు పెరగడం మార్కెట్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ధరలు త్వరగా తగ్గే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
కేవలం బంగారం మాత్రమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. వెండి ధరలు ఇప్పుడు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. హైదరాబాద్, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర రూ.3,40,100 వద్ద కొనసాగుతోంది. వెండిపై కూడా ఒకే రోజు రూ.100 మేర పెరుగుదల కనిపించింది. అటు బంగారం, ఇటు వెండి.. రెండూ పోటీ పడి మరీ పెరుగుతుండటంతో సామాన్యులు ఆభరణాల దుకాణాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.
