Harish Rao

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్‌ విచారణకు హాజరైన హరీశ్ రావు

Harish Rao: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్ (SIT) అధికారుల ఎదుట హాజరయ్యారు. సోమవారమే ఆయనకు నోటీసులు అందిన నేపథ్యంలో, నేడు ఆయన విచారణకు వచ్చారు.

హరీశ్ రావు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో అక్కడ కాస్త ఉద్రిక్తత నెలకొంది. ఆయన వెంట వచ్చిన న్యాయవాదులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. కేవలం హరీశ్ రావును మాత్రమే విచారణ గదిలోకి తీసుకెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ స్టేషన్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. సోమవారం అధికారులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇవ్వగా, జిల్లా పర్యటనలో ఉన్న ఆయన నేడు విచారణకు అందుబాటులోకి వచ్చారు.

అసలు ఈ కేసు గత రెండేళ్లుగా సాగుతోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చివరకు జడ్జీల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై 2024 మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోవడంతో దర్యాప్తు కొంతకాలం నెమ్మదించింది.

అయితే, ఇటీవల ప్రభాకర్ రావు హైదరాబాద్ తిరిగి రావడంతో ఈ కేసు విచారణ మళ్లీ వేగవంతమైంది. ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్, ఇప్పుడు రాజకీయ నేతల పాత్రపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే హరీశ్ రావును విచారిస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *