Jio Hotstar Plans: ఓటీటీ రంగంలో అగ్రగామిగా ఉన్న జియో హాట్ స్టార్ తమ వినియోగదారుల కోసం కీలక మార్పులను ప్రకటించింది. ఇప్పటివరకు కేవలం మూడు నెలలు లేదా ఏడాది కాల పరిమితితో ఉన్న ప్లాన్లను మార్చి, ఇకపై అన్ని విభాగాల్లోనూ నెలవారీ (Monthly) ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు జనవరి 28, 2026 నుండి అమలులోకి రానున్నాయి. మొబైల్ వినియోగదారులతో పాటు టీవీల్లో సినిమాలు చూసే వారికి కూడా మరింత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.
కొత్త ప్లాన్ల ప్రకారం, మొబైల్ యూజర్లు నెలకు రూ.79 తో సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. అలాగే సూపర్ ప్లాన్ నెలకు రూ.149 కి, ప్రీమియం ప్లాన్ రూ.299 కి లభించనున్నాయి. అయితే, వార్షిక ప్లాన్ల ధరలను సంస్థ భారీగా పెంచింది. సూపర్ వార్షిక ప్లాన్ పై రూ.200, ప్రీమియం వార్షిక ప్లాన్ పై రూ.700 వరకు అదనపు భారం పడనుంది. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు తమ ప్లాన్‌ను ఆటో-రిన్యువల్ చేసుకుంటే పాత ధరలే వర్తిస్తాయని, కొత్తగా చేరే వారికి మాత్రమే ఈ కొత్త ధరలు వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Phone Tapping Case: సిట్ ముందుకు మాజీ మంత్రి హరీష్ రావు.. ఏం జరగబోతోంది?
హాలీవుడ్ సినిమాలు చూసే వారి కోసం కంటెంట్ యాక్సెస్‌లో కూడా మార్పులు చేశారు. సూపర్, ప్రీమియం ప్లాన్ తీసుకునే వారికి హాలీవుడ్ సినిమాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. కానీ, కేవలం మొబైల్ ప్లాన్ తీసుకునే వారికి మాత్రం హాలీవుడ్ కంటెంట్ నేరుగా రాదు. వారు కావాలనుకుంటే అదనంగా కొంత మొత్తం చెల్లించి ‘యాడ్-ఆన్’ ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. 45 కోట్ల మందికి పైగా నెలవారీ వినియోగదారులను కలిగిన జియో హాట్ స్టార్, ఈ మార్పుల ద్వారా మరింత మందిని ఆకట్టుకోవాలని చూస్తోంది.
కొత్త ధరల వివరాలు (జనవరి 28 నుండి):
| ప్లాన్ రకం | నెలకు | 3 నెలలకు | 1 సంవత్సరానికి |
| మొబైల్ | రూ.79 | రూ.149 | రూ.499 |
| సూపర్ | రూ.149 | రూ.349 | రూ.1099 |
| ప్రీమియం | రూ.299 | రూ.699 | రూ.2199 |
