Mp kalisheytti: బీఆర్ఎస్, వైఎస్సార్సీపీ కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ రెండు పార్టీల అజెండా ఒకటేనని, గోదావరి జలాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగన్ కోర్టుకు హాజరైన సమయంలో బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం పలకడం, అలాగే కేటీఆర్ ఖమ్మం పర్యటన సమయంలో వైఎస్సార్సీపీ నేతలు అదే విధమైన చర్యలు చేయడం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న అనుబంధాన్ని స్పష్టంగా తెలియజేస్తోందని కలిశెట్టి అన్నారు. స్నేహం పేరుతో ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం తప్పు అని హెచ్చరించారు.
జగన్ బెంగళూరులో కూర్చొని కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, ఆ కుట్రల్లో బీఆర్ఎస్ కూడా భాగస్వామిగా మారిందని అప్పలనాయుడు ఆరోపించారు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ రాయలసీమకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై పని చేయకుండా, సొంత ప్రయోజనాలను ముందుకు పెట్టారని విమర్శించారు.
ప్రజల అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోందని కలిశెట్టి స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ చేస్తున్న రాజకీయ కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన తీర్పు ఇస్తారని అన్నారు.
