Rich Beggar: గతంలో బిచ్చగాడు అంటే కడుపు నింపుకోవడానికి అడుక్కుంటున్నాడు అనేవారు. కానీ ఈ రోజుల్లో బిచ్చమడుక్కోవడం కూడా ఒక బిజినెస్ అయిపోయింది. ఈ విషయం చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది. మధ్యప్రదేశ్ (MP) లోని ఇండోర్ నగరాన్ని బిచ్చగాళ్లు లేని నగరంగా మార్చాలని చూస్తున్న అధికారులకు, ఒక బిచ్చగాడు తన ఆస్తుల చిట్టా చెప్పి షాక్ ఇచ్చాడు.
బిచ్చగాడి రూపంలో లక్షాధికారి
ఇండోర్‌ను బిచ్చగాళ్లు లేని సిటీగా మార్చాలని అధికారులు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సరాఫా బజార్లో మంగీలాల్ అనే వికలాంగుడు కనిపించాడు. అతని గురించి ఆరా తీసిన అధికారులకు దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి.
తనకు మూడు ఇళ్లు, మూడు ఆటోలు, ఒక కారు ఉన్నాయని మంగీలాల్ చెప్పాడు. ఈ విషయం విన్న అధికారులు ఆశ్చర్యపోయారు. తన దగ్గర ఉన్న మూడు ఆటోలను అద్దెకు ఇస్తున్నట్లు తెలిపాడు. కారులో బయటకు వెళ్లేటప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఒక డ్రైవర్‌ను కూడా పెట్టుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, బంగారు వ్యాపారులకు కూడా తాను వడ్డీకి డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం మరో ఎత్తు. రోజుకు తక్కువలో తక్కువగా 500 నుండి 1000 రూపాయల వరకు ఆదాయం వస్తోందని పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Gold & Silver Rate Today:బంగారాన్ని మించిపోయిన వెండి ధరలు
పొదుపుతోనే సాధ్యం బిచ్చగాడే కదా అని తక్కువగా చూడకుండా గమనిస్తే, అతని నుండి డబ్బు సంపాదించడం ఎలాగో నేర్చుకోవచ్చు. తను సంపాదించుకున్న ప్రతి రూపాయిని అనవసరంగా ఖర్చు చేయకుండా దాచుకున్నాడు. ఆ డబ్బుతో మొదట ఆటోలు కొని వాటిని అద్దెకు ఇచ్చాడు. వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూడా ఖర్చు చేయకుండా ఇళ్లు కొనడం, మరికొన్ని ఆటోలు, కారు కొని వడ్డీ వ్యాపారం చేస్తూ సంపద పెంచుకున్నాడు.
కొంతమంది “అంత డబ్బు ఉండి ఏం లాభం? అనుభవించలేనప్పుడు” అని అనవచ్చు. కానీ మనందరం ఒకరి కింద బానిసల్లా పని చేస్తూ బతుకుతాం, అయినా అవసరానికి డబ్బు ఉండదు. కావల్సినవి కొనుక్కోలేం, ఒకవేళ కొన్నా ప్రతి నెలా ఈఎంఐలు (EMI) కడుతూ వచ్చిన జీతంతో సర్దుకుపోతుంటాం. అలా అని బిచ్చం ఎత్తుకోమని చెప్పడం లేదు కానీ, సంపాదించిన దానిలో పొదుపు చేయడం ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ చెబుతోంది.
