Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ పోలీసుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేశారు. చట్టం అందరికీ సమానమని చెప్పే డీజీపీ శివధర్‌రెడ్డి ఇప్పుడు ఆ మాటలను అమలు చేయడంలేదని ఎద్దేవా చేశారు. “డీజీపీ ఖాకీ బుక్ ఎక్కడ? ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా?” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రస్తావించిన హరీశ్‌రావు, ఆయన కాంట్రాక్టర్లను రూ.8 కోట్లు ఇవ్వాలని బెదిరించాడని ఆరోపించారు. ఈ వ్యవహారం పై బాధిత కాంట్రాక్టర్ స్వయంగా ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
సంపత్‌కుమార్ కేసులో సిట్ ఏర్పాటు చేయకపోవడం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నేతలు, జర్నలిస్టులపై మాత్రం ప్రత్యేక దర్యాప్తు బృందాలు, కమిషన్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలపై మాత్రం నిబంధనలు మార్చుకుంటోందని మండిపడ్డారు.
జర్నలిస్టుల కేసులో ఏర్పాటు చేసిన సిట్ గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని చెప్పడం, ముఖ్యమంత్రి పరిపాలన పూర్తిగా విఫలమైందని నిరూపిస్తోందని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. రాష్ట్ర పరిపాలనను నడపాల్సిన ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో ప్రజలు ప్రశ్నించడం సమంజసమేనని అన్నారు.
చట్టాన్ని రాజకీయ ఆయుధంగా వాడుకుంటే అది ఎప్పటికైనా శిక్షించేదే అని హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రజలు తగిన సమయంలో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు.
