Davos WEF 2026: ప్రపంచ ఆర్థిక గమనాన్ని శాసించే ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026’ సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది.
తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 90వ దశకంలోనే భారతదేశం నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన తొలి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లలో చంద్రబాబు ఒకరని ఆయన కొనియాడారు. దావోస్ సదస్సు అంటే కేవలం ఒప్పందాలపై సంతకాలు చేయడం మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, సాంకేతిక పోకడలు ఏ దిశగా మారుతున్నాయో అర్థం చేసుకునే గొప్ప వేదిక అని అభిప్రాయపడ్డారు.
ఇది కూడా చదవండి: Medaram Jatara 2026: మేడారం బస్సులో వెళ్లానుకుంటున్నారా? చార్జీలు ఇవే తెలుసుకోండి!
పెట్టుబడిదారులతో కీలక భేటీలు
నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి బృందం సుమారు 36 కీలక కార్యక్రమాల్లో పాల్గొననుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో పాటు గూగుల్ క్లౌడ్, ఐబీఎం (IBM) వంటి అంతర్జాతీయ సంస్థల సీఈఓలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఏపీలో ఉన్న అనుకూలతలు, నూతన పారిశ్రామిక విధానాలను వివరించడానికి దావోస్‌లో ప్రత్యేకంగా ‘ఏపీ లాంజ్’ను కూడా ఏర్పాటు చేశారు.
యువతకు ఉపాధే అంతిమ ధ్యేయం
రాష్ట్రానికి భారీగా విదేశీ పెట్టుబడులను (FDI) ఆకర్షించడమే కాకుండా, రాష్ట్రాన్ని టెక్నాలజీ మరియు తయారీ రంగాలకు హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ వంటి ఆధునిక రంగాల్లో పెట్టుబడుల ద్వారా యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే దేశవ్యాప్త పెట్టుబడుల్లో ఏపీ 25 శాతం వాటాను దక్కించుకుందని, దావోస్ పర్యటనతో ఇది మరింత పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
