CM Chandrababu

Chandrababu: తెలుగు జాతి గర్వపడేలా పాలన.. అరాచక శక్తులకు తావులేదు

Chandrababu: తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన తెలుగు జాతి చరిత్ర గతిని మార్చిన ఒక మహానీయుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు తెలుగు వారిని ‘మదరాసీలు’ అని పిలుస్తూ అవహేళన చేస్తుంటే, మన ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన గుర్తు చేశారు.

ఎన్టీఆర్ సంస్కరణలే స్ఫూర్తి

రాజకీయాల్లోకి చదువుకున్న వారిని తీసుకురావడం నుంచి మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం వరకు ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం విప్లవాత్మకమని చంద్రబాబు పేర్కొన్నారు. బీసీలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించి వారికి సామాజిక న్యాయం అందించారని, టీటీడీలో అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా ఆయనేనని చెప్పారు. నాడు ఎన్టీఆర్ వేసిన పునాదుల వల్లే నేడు తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారని వివరించారు.

సంక్షేమం.. అభివృద్ధికి పెద్దపీట

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ‘సూపర్ సిక్స్’ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 270 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని, త్వరలోనే మరో 700 క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే వచ్చే ఉగాది పండుగ నాటికి 5 లక్షల గృహప్రవేశాలు చేయించబోతున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం భూములపై వేసుకున్న ఫోటోలను తొలగించి, పారదర్శకమైన పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: Chandrababu Naidu: ఎన్టీఆర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా చంద్ర‌బాబు, లోకేశ్ ఏమ‌న్నారంటే?

రౌడీయిజానికి రాష్ట్రంలో చోటు లేదు

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో తాము చాలా కఠినంగా ఉంటామని చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ పార్టీల ముసుగులో రౌడీయిజం చేసే వారిని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. “బాబాయ్‌ని చంపినంత ఈజీ కాదు రాష్ట్రంలో రౌడీయిజం చేయడం.. ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, సీబీఎన్ అని గుర్తు పెట్టుకోండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కక్ష సాధింపు చర్యల కోసం కాకుండా, రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నామని చెప్పారు.

హైదరాబాద్ అభివృద్ధి మా క్రెడిట్

నాడు తొమ్మిదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి వల్లే నేడు హైదరాబాద్ నగరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చంద్రబాబు గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని, దేశవ్యాప్తంగా వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్లలో 25 శాతం మన రాష్ట్రానికే రావడం గర్వకారణమని పేర్కొన్నారు. పార్టీ కోసం ప్రాణాలైనా వదిలే కార్యకర్తలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన ఉద్ఘాటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *