Bhatti Vikramarka: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సింగరేణి బొగ్గు గనుల టెండర్ల వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాశారని ఓ మీడియా ఛానల్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మీడియా సంస్థ రాసినవన్నీ కట్టుకథలని, వాస్తవాలు తెలుసుకోకుండా అభూత కల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికే
తాను ఆస్తులు సంపాదించడానికో లేక పదవులు అనుభవించడానికో రాజకీయాల్లోకి రాలేదని భట్టి స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులను కాపాడటమే తన ప్రధాన లక్ష్యమని, సమాజంలోని వనరులను అందరికీ సమానంగా పంచాలన్న ఉద్దేశంతోనే పని చేస్తున్నానని చెప్పారు. తన జీవితం ఒక తెరిచిన పుస్తకమని, గద్దల్లాంటి వారి నుంచి ప్రజా సంపదను రక్షించడమే తన బాధ్యతని ఆయన వివరించారు.
ఇది కూడా చదవండి:Chandrababu Naidu: ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్ ఏమన్నారంటే?
నిబంధనలపై అవగాహన ఉండాలి
టెండర్ల ప్రక్రియపై అవగాహన లేకుండా వార్తలు రాయడం సరికాదని భట్టి హితవు పలికారు. సింగరేణి సంస్థే టెండర్లను పిలుస్తుందని, నిబంధనలను సంస్థ బోర్డు నిర్ణయిస్తుందని, ఇందులో మంత్రి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. గనులు క్లిష్టమైన ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ‘ఫీల్డ్ విజిట్’ వంటి నిబంధనలు పెట్టడం సహజమని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇవే నియమాలను పాటిస్తాయని ఆయన గుర్తు చేశారు. అయినప్పటికీ, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా పాత టెండర్లను రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలవాలని ఇప్పటికే బోర్డును ఆదేశించినట్లు వెల్లడించారు.
మంత్రుల మధ్య విభేదాలు సృష్టించే పన్నాగాలు
మీడియా సంస్థల మధ్య ఉండే పోటీలోకి ప్రజా ప్రతినిధులను లాగవద్దని ఆయన సూచించారు. మంత్రుల మధ్య గొడవలు పెట్టాలని చూస్తే కుదరదని, ప్రభుత్వం అందరం కలిసికట్టుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నామని చెప్పారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను సన్నిహితుడిగా ఉన్నానన్న కోపంతోనే తనపై ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారని భట్టి ఆరోపించారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
