Telangana Cabinet Meeting

Telangana Cabinet Meeting: రేపు మేడారంలో తెలంగాణ క్యాబినెట్ భేటీ..

Telangana Cabinet Meeting: తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టానికి ములుగు జిల్లాలోని మేడారం వేదిక కాబోతోంది. ఎప్పుడూ హైదరాబాద్‌లోని సచివాలయానికే పరిమితమయ్యే రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని, ఈసారి గిరిజన దేవతలు సమ్మక్క-సారలమ్మల చెంత నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్‌లో రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని నగరం వెలుపల, ముఖ్యంగా ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వం ఇటువంటి కీలక సమావేశాన్ని నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధానంగా మేడారం జాతరను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు అవసరమైన ‘మేడారం మాస్టర్ ప్లాన్’ పై మంత్రుల బృందం చర్చించనుంది. అలాగే జాతరకు జాతీయ హోదా సాధించడం, భక్తుల సౌకర్యాల కోసం అదనపు నిధుల విడుదల వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. వీటితో పాటు రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల ఖరారుపై క్యాబినెట్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు, రైతు భరోసా, ఆరు గ్యారెంటీ పథకాల అమలు పురోగతిపై కూడా ప్రభుత్వం సమీక్ష జరపనుంది.

Also Read: Vijayasai Reddy: మద్యం అక్రమాల కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ షాక్!

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం 4 గంటలకు మేడారం చేరుకుని, 5 గంటలకు మంత్రివర్గ సహచరులతో సమావేశమవుతారు. భేటీ అనంతరం ఆయన స్థానిక గిరిజన నేతలతో ప్రత్యేకంగా మాట్లాడి, రాత్రికి అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత, ఆయన నేరుగా దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మంత్రి సీతక్క ఇప్పటికే కలెక్టర్, ఎస్పీలతో కలిసి మేడారంలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *