Traffic Rush: సంక్రాంతి పండుగ పూట పల్లెటూళ్లన్నీ కళకళలాడుతున్నాయి. తమ ఊర్లలో పండుగ జరుపుకోవడానికి నగరవాసులు భారీగా బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే కార్లు, బస్సులు వేల సంఖ్యలో ఉండటంతో హైవేపై రద్దీ విపరీతంగా పెరిగింది.
మంగళవారం తెల్లవారుజాము నుండే ప్రయాణికుల తాకిడి మొదలైంది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది. పంతంగితో పాటు పెదకాపర్తి, చిట్యాల వంటి ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సొంత ఊళ్లకు వెళ్లేవారు ఇబ్బంది పడకుండా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రయాణికులు సహనంతో ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. పండుగకు వెళ్లే హడావిడిలో వాహనదారులు వేగం కంటే భద్రతకే ప్రాముఖ్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.
