Cyber Scam: సినిమా కష్టాలు నిజ జీవితంలో ఎదురైతే ఎంత భయంకరంగా ఉంటాయో ఢిల్లీకి చెందిన ఒక వృద్ధ డాక్టర్ దంపతుల ఉదంతం చూస్తే అర్థమవుతుంది. సుమారు 48 ఏళ్ల పాటు అమెరికాలో డాక్టర్లుగా పనిచేసి, రిటైర్మెంట్ తర్వాత సొంత దేశానికి సేవ చేయాలనే గొప్ప లక్ష్యంతో ఇండియాకు తిరిగి వచ్చిన డాక్టర్ ఓం తనేజా, డాక్టర్ ఇందిరా తనేజా దంపతులు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి అక్షరాలా 14.85 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. రజనీకాంత్ ‘శివాజీ’ సినిమాలో మాదిరిగా మంచి చేయాలనుకున్న వారిని దుండగులు డిజిటల్ అరెస్టు పేరుతో నరకం చూపించి నిలువునా దోచుకున్నారు.
ఈ మోసం గత ఏడాది డిసెంబర్ 24న మొదలైంది. తాము పెద్ద పోలీసు అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, మీ పేరు మీద అరెస్ట్ వారెంట్లు ఉన్నాయని, మీరు మనీ లాండరింగ్ లాంటి తీవ్రమైన నేరాలు చేశారని ఆ వృద్ధ దంపతులను భయపెట్టారు. డిసెంబర్ 24 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు వారిని వీడియో కాల్స్ ద్వారా ఇంట్లోనే బందీలుగా ఉంచారు. బయట ఎవరికైనా చెబితే అరెస్ట్ చేస్తామని, జైలుకు పంపిస్తామని బెదిరించడంతో ఆ వృద్ధులు ప్రాణభయంతో వారు చెప్పినట్లు విన్నారు. దీన్నే సైబర్ నేరగాళ్ల భాషలో ‘డిజిటల్ అరెస్ట్’ అని పిలుస్తారు.
ఇది కూడా చదవండి: PSLV-C62: నింగిలోకి పీఎస్ఎల్వీ-సి62.. కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ!
ఈ బందీ సమయంలో నేరగాళ్లు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. డాక్టర్ ఓం తనేజాను ఇంట్లో వీడియో కాల్ పర్యవేక్షణలో ఉంచి, ఆయన భార్య ఇందిరా తనేజాను బ్యాంకుల చుట్టూ తిప్పారు. బ్యాంకుల్లో ఉన్న డబ్బును వేర్వేరు ఖాతాలకు బదిలీ చేయాలని ఒత్తిడి చేశారు. అంత పెద్ద మొత్తం ఎందుకు పంపిస్తున్నారని బ్యాంక్ సిబ్బంది అడిగితే ఏం చెప్పాలో కూడా వారే నేర్పించి పంపారు. అలా విడతల వారీగా సుమారు 15 కోట్ల రూపాయలు కాజేశారు. తమ డబ్బును ఆర్బీఐ తిరిగి పంపిస్తుందని నేరగాళ్లు చెప్పిన మాటలను నమ్మిన బాధితులు, చివరకు వారు స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.
ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇన్నేళ్ల కష్టార్జితం ఒక్కసారిగా ఆవిరైపోవడంతో ఆ వృద్ధ దంపతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, చట్టబద్ధమైన సంస్థలు ఎప్పుడూ వీడియో కాల్స్ ద్వారా అరెస్టులు చేయవని, ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
