Traffic Jam

Traffic Jam: నిర్మాణంలో ఉన్న 6 ఫ్లై ఓవర్లు.. హైవేలపై చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్..

Traffic Jam: సంక్రాంతి పండుగ పూట సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. ఊరు చేరి పండగ చేసుకోవాలన్న ఆరాటంతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన వేలాది మంది ప్రజలు హైవేలపై గంటల తరబడి చిక్కుకుపోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్క టోల్ గేట్ వద్దే నిమిషానికి సుమారు 47 వాహనాలు దాటుతున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 18 గంటల్లోనే సుమారు లక్షా 60 వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు.

ఫ్లైఓవర్ నిర్మాణాలే అసలు అడ్డంకి కేవలం వాహనాల సంఖ్య పెరగడమే కాకుండా, విజయవాడ హైవేపై ప్రస్తుతం జరుగుతున్న 6 ఫ్లైఓవర్ల నిర్మాణ పనులు ప్రయాణికులను మరింత ఇబ్బంది పెడుతున్నాయి. పెద్దకాపర్తి, చిట్యాల ప్రాంతాల్లో ఫ్లైఓవర్ పనులు జరుగుతుండటంతో వాహనాల వేగం పూర్తిగా తగ్గిపోయింది. సూర్యాపేట, కోదాడ పరిసరాల్లో కూడా కొత్త వంతెనల నిర్మాణం వల్ల దారి మళ్లింపులు చేపట్టారు. దీనివల్ల వాహనాలు నెమ్మదిగా కదలడమే కాకుండా, కొన్ని చోట్ల కిలోమీటర్ల మేర లైన్లు కడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Harish Rao: రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్.. “ఇది ప్రజా పాలనా? లేక పైరవీల పాలనా?”

మరో రెండు రోజులు ఇదే రద్దీ. టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈరోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు ట్రాఫిక్ ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఉద్యోగ, వ్యాపారాల కోసం నగరంలో ఉంటున్న వారు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో విజయవాడతో పాటు వరంగల్, చెన్నై హైవేలు కూడా వాహనాలతో నిండిపోయాయి. సొంతూళ్లకు వెళ్లే వారు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలతో తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *