Pongal Movies: వచ్చే సంక్రాంతి పండగకు బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం ఖాయమైంది. దళపతి విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’, శివకార్తికేయన్ మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘పరాశక్తి’ రెండు కూడా ఒక్క రోజు తేడాతో థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అయితే ఈ బిగ్ స్క్రీన్ క్లాష్ కన్నా ముందు, తెర వెనుక జరుగుతున్న ‘రెవెన్యూ షేరింగ్’ వివాదం ఇప్పుడు తమిళనాట దావానలంలా వ్యాపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలు విడుదలవుతుంటే థియేటర్ల వద్ద పండగ వాతావరణం ఉండాలి, కానీ నిర్మాతలు అడుగుతున్న అసాధారణమైన వాటాతో ఎగ్జిబిటర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఈ వివాదంపై తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుప్పూర్ సుబ్రమణ్యం కుండబద్దలు కొట్టినట్లు కొన్ని వాస్తవాలను బయటపెట్టారు. ముఖ్యంగా ‘జననాయగన్’ చిత్ర నిర్మాతలు వసూళ్లలో దాదాపు 75 నుంచి 80 శాతం వరకు షేర్ డిమాండ్ చేయడం థియేటర్ యజమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
ఉదాహరణకు 190 రూపాయల టికెట్ ధరలో పన్నులు పోగా మిగిలిన మొత్తంలో సింహభాగం నిర్మాతలకే వెళ్తే, కనీసం కరెంటు బిల్లులు మరియు సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి వస్తుందని ఆయన వాపోతున్నారు. గతంలో విజయ్ నటించిన ‘గోట్’ సినిమాకు కూడా ఇలాగే 75 శాతం వాటా ఇచ్చి తీవ్రంగా నష్టపోయామని, ఈ పద్ధతి కొనసాగితే థియేటర్ల మనుగడ కష్టమని ఎగ్జిబిటర్లు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viral News: ఏంట్రా బాబు ఇది.. దొంగతనం చేయడానికి వచ్చి.. ఎగ్జాస్ట్ ఫ్యాన్ లో ఇరుక్కుపోయాడు..
మరోవైపు, ఈ సంక్రాంతి రేసులో పోటీ ఇద్దరు స్టార్ల మధ్య మాత్రమే కాకుండా, క్రేజ్ విషయంలోనూ నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ‘జననాయగన్’ పై 75 శాతం ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఉంటే, శివకార్తికేయన్ ‘పరాశక్తి’ పై అది 80 శాతంగా ఉండటం గమనార్హం. కేరళలో విజయ్‌కు తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, కోయంబత్తూర్ వంటి ఏరియాల్లో పోటీ తీవ్రంగా ఉంది. అయితే నిర్మాతల ‘పర్సంటేజ్ వార్’ కారణంగానే అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఇక ఈ సినిమా క్లాష్‌పై హీరో శివకార్తికేయన్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. నిజానికి తన సినిమాను దీపావళికే విడుదల చేయాలని భావించామని, కానీ విజయ్ సినిమా కోసం తాము తప్పుకొని పొంగల్ రేసులోకి వచ్చామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ‘జననాయగన్’ కూడా అదే సమయానికి వస్తుండటం తనను విస్మయానికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జనవరి 9న విజయ్, జనవరి 10న శివకార్తికేయన్ సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్న నేపథ్యంలో, ఈ ఆదాయ పంపిణీ గొడవలు ఎక్కడికి దారితీస్తాయోనన్న భయం సినీ వర్గాల్లో నెలకొంది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి 50:50 లేదా 60:40 నిష్పత్తిలో లాభాలు పంచుకుంటేనే చిత్ర పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.
