Hyderabad: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భారీ ఆర్థిక మోసం కేసులో ఫాల్కన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్‌ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ జరిపిన లోతైన విచారణలో వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చింది.
సీఐడీ అధికారుల ప్రకారం, నకిలీ వెబ్సైట్లు, మొబైల్ యాప్స్‌ను సృష్టించి ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను ఆకర్షించి మోసానికి పాల్పడినట్లు తేలింది. ఆకర్షణీయమైన లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడులు పెట్టించారని అధికారులు వెల్లడించారు.
మోసం చేసే విధానం (మోడస్ ఆపరెండీ)
ఫాల్కన్ సంస్థ ప్రతిష్టాత్మకమైన MNC కంపెనీలతో ఒప్పందాలు ఉన్నట్లుగా చూపిస్తూ నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసింది. ప్రముఖ కంపెనీల పేర్లతో ఫేక్ ఇన్వాయిస్లు, నకిలీ అగ్రిమెంట్లు రూపొందించి పెట్టుబడిదారుల నమ్మకం సంపాదించినట్లు సీఐడీ గుర్తించింది.
యాప్స్, వెబ్సైట్లలో పెట్టుబడులకు అధిక లాభాలు వచ్చినట్లు ఫేక్ డాష్‌బోర్డులు చూపిస్తూ, పెట్టుబడిదారులను మరింత డబ్బు పెట్టేలా ప్రోత్సహించారు. వాస్తవానికి ఎలాంటి నిజమైన వ్యాపార కార్యకలాపాలు జరగలేదని విచారణలో తేలింది
ఈ స్కామ్ ద్వారా మొత్తం రూ. 4,215 కోట్ల వరకు డిపాజిట్లు వసూలు చేసినట్లు సీఐడీ అంచనా వేసింది. మొత్తం 7,056 మంది డిపాజిటర్లు ఉన్నట్లు అందులో ఇప్పటివరకు 4,065 మంది బాధితులను అధికారికంగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు
ఇంకా ఫిర్యాదులు వస్తే బాధితుల సంఖ్య, మోసం మొత్తాలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు
ప్రజలకు సీఐడీ హెచ్చరిక
హామీగా అధిక లాభాలు వస్తాయని చెప్పే ఇన్వెస్ట్మెంట్ స్కీముల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐడీ సూచించింది. నమోదు లేని యాప్స్, అనుమానాస్పద వెబ్సైట్లలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవాలని హెచ్చరించింది.
ఈ కేసులో త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
